కుప్ప‘కూలి’న గోడ.. తెల్లారిన ఆరుగురి బతుకులు

8 Mar, 2021 23:01 IST|Sakshi

పాట్నా: కాలువ తవ్వకం చేస్తుండగా పాఠశాల ప్రహారి గోడ కుప్పకూలిపోయింది. అయితే గోడ పనులు చేస్తున్న కూలీలపై పడడంతో వారి శిథిలాల కింద ఛిద్రమయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం 6గురు కూలీలు దుర్మరణం పాలవగా.. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన బిహార్‌లో ఖగారియా జిల్లా మహేశ్‌ఖంట్‌ పోలీస్‌ పరిధిలోని చాందీతోలా ప్రాంతంలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చాందీతోల ప్రాంతంలో ఉన్న పాఠశాల ప్రహారి గోడకు సమీపంలో భూగర్భ కాలువ తవ్వకాలు చేపట్టారు. మొత్తం 12 మంది కూలీలు పాల్గొంటున్నారు. ఈ పనుల్లో భాగంగా జేసీబీ ప్రహారి గోడకు సమీపం తవ్వకాలు చేపట్టడంతో పగులుళ్లు వచ్చి కూలిపోయింది. ఈ పనుల వలన పాఠశాల ప్రహారి గోడకు పగుళ్లు ఏర్పడి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 6 గురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరికొందరు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదానికి కారణం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమేనని స్థానికులు, మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే జేసీబీకి సంబంధించిన వ్యక్తులు పరారయ్యారు. 

మరిన్ని వార్తలు