వీరుడా వందనం

12 Dec, 2020 03:46 IST|Sakshi
ప్రీతిపాల్‌ సింగ్‌ గిల్‌

త్రివిధ దళాల్లో పని చేసిన ఒకే ఒక్కడు

కల్నల్‌ ప్రీతిపాల్‌ సింగ్‌కు శుభాకాంక్షల వెల్లువ

న్యూఢిల్లీ : త్రివిధ బలగాల్లో సేవలందించి ప్రత్యేకత చాటుకున్న ఒకే ఒక్క భారతీయుడు, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సాహసికుడు, ప్రీతిపాల్‌ సింగ్‌ గిల్‌ 100 ఏళ్ల పుట్టిన రోజు పండుగని కుటుంబ సభ్యుల మధ్య వేడుకగా జరుపుకున్నారు. ఆర్మీలో కల్నల్‌గా రిటైర్‌ అయిన ప్రీతిపాల్‌ సింగ్‌ గిల్‌ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం తన నూరవ పుట్టిన రోజు నాడు బొటనవేలు పైకెత్తి చూపిస్తూ ప్రీతిపాల్‌ పోస్టు చేసిన ఫొటోకి నెటిజన్లు చెయ్యెత్తి జై కొట్టారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట జిల్లా పాఖీ గ్రామానికి చెందిన ప్రీతిపాల్‌ కుటుంబం తరతరాల నుంచి సైన్యంలోనే పనిచేస్తోంది. 1920 డిసెంబర్‌ 11న పాటియాలాలో పుట్టిన ప్రీతిపాల్‌ సింగ్‌ 1942లో భారత వాయుసేనలో చేరారు. అయితే ఆయన తండ్రి తన కుమారుడు విమానం కూలి ఎక్కడ మరణిస్తాడో అన్న భయంతో నేవీకి పంపించారు. 

కార్గో నౌకలకు ఎస్కార్ట్‌గా ప్రీతిపాల్‌సింగ్‌ రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. కొన్నేళ్ల తర్వాత ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆర్మీకి బదిలీ చేశారు. గ్వాలియర్‌ మౌంటెన్‌ రెజిమెంట్‌లో సేవలు అందిస్తూ 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌ సెక్టార్‌ కమాండర్‌గా పని చేస్తూ 1970లో రిటైర్‌ అయ్యారు. పదవీ విరమణ తర్వాత తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య ప్రమీందర్‌ కౌర్‌కి ఇప్పుడు 95 ఏళ్లు. వారిద్దరికీ ఒకే ఒక్క కుమారుడు ఉన్నారు. సింగ్‌ శరీరానికే వయ సు వచ్చిందే తప్ప ఆయన మనసు ఎప్పు డూ నిత్య యవ్వనంతో ఉరకలేస్తూ ఉంటుం దని ప్రీతిపాల్‌ మనవడు అభయ్‌పాల్‌ చెప్పారు. టెన్నిస్, బ్యాడ్మింటన్‌ ఆడడం అం టే ఆయనకి చాలా ఇష్టం. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌తో పాటు పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.   

మరిన్ని వార్తలు