గేట్స్‌ ఫౌండేషన్‌కు బఫెట్‌ రాజీనామా

24 Jun, 2021 05:47 IST|Sakshi

సేవా కార్యక్రమాలకు మరో రూ.30,413 కోట్లు వెచ్చిస్తానని వెల్లడి

న్యూఢిల్లీ: షేర్‌ మార్కెట్‌ దిగ్గజం, బెర్క్‌షైర్‌ హాథ్‌వే చైర్మన్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వారెన్‌ బఫెట్‌(90) ‘బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌(బీఎంజీ) ఫౌండేషన్‌’ ట్రస్టీ పదవికి రాజీనామా చేశారు. ‘‘చాలా ఏళ్లుగా బీఎంజీ ఫౌండేషన్‌ ట్రస్టీగా కొనసాగుతున్నా. కొన్నాళ్లుగా ఈ పోస్టులో నేను చురుగ్గా వ్యవహరించడం లేదు.  చాలా కార్పొరేట్‌ సంస్థల బోర్డులకు రాజీనామా చేసినట్లుగానే బీఎంజీ ఫౌండేషన్‌ ట్రస్టీ పదవి నుంచి తప్పుకుంటున్నా. ఫౌండేషన్‌ సీఈవోగా మార్క్‌ సుజ్‌మన్‌ చక్కగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఎన్నికైన ఆయనకు నా పూర్తి మద్దతు ఉంటుంది. నా లక్ష్యాలు, ఫౌండేషన్‌లోని పెద్దల లక్ష్యాలు ఒక్కటే. ఈ లక్ష్యాలను సాధించడానికి ఇక నా భౌతికపరమైన భాగస్వామ్యం అవసరం లేదు’’ అని బఫెట్‌ పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాను పెట్టుబడి పెట్టిన మొత్తం షేర్లను దానం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో సగం దూరం ప్రయాణం చేశానని తెలిపారు. అలాగే మరో 4.1 బిలియన్‌ డాలర్లను (రూ.30,413 కోట్లు) సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తానని వెల్లడించారు. అయితే, ట్రస్టీ పోస్టు నుంచి తప్పుకోవడానికి గల కారణాలను ఆయన బయటపెట్టలేదు.

27 ఏళ్ల వివాహ బంధం నుంచి వైదొలిగామని, విడాకులు తీసుకుంటామని బిల్‌ గేట్స్, మెలిండా గేట్స్‌ ప్రకటించిన కొన్ని వారాల్లోనే వారెన్‌ బఫెట్‌ నుంచి రాజీనామా ప్రకటన రావడం గమనార్హం. ప్రపంచంలో అతిపెద్ద దాతృత్వ సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన బీఎంజీ ఫౌండేషన్‌లో ఇకపైనా కలిసి పనిచేస్తామని బిల్‌ గేట్స్, మెలిండా గేట్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు