'నా ఆత్మహత్య కశ్మీర్‌ ప్రభుత్వ టీచర్లకు అంకితం'

1 Jun, 2021 17:28 IST|Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన షోహిబ్‌ బషీర్‌ అనే విద్యార్థి శనివారం(మే 29న) ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఏంఏ సైకాలజీ చదువుతున్న అతను పరీక్ష ఫీజు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే బషీర్‌ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఫోన్‌లో రికార్డు చేసిన వీడియో వెలుగులోకి రావడంతో అసలు కారణం బయటపడింది. ఆ వీడియోలో బషీర్‌ పలికిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి.

''మా నాన్న బషీర్‌ అహ్మద్‌ మిర్‌..  గవర్నమెంట్‌ పాఠశాలలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగి అయిన మా నాన్నకు  గత రెండు సంవత్సరాలుగా జీతం చెల్లించడం లేదు. దీంతో రెండేళ్లుగా మా ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. రెండేళ్ల క్రితం వరకు ఎంతో ఆనందంగా ఉన్న నా కుటుంబ పరిస్థితి విచ్చిన్నంగా తయారైంది. చదువును ఎక్కువగా ఇష్టపడే నేను.. ఏదైనా పని చేసుకొని ఫీజు చెల్లించాలనుకున్నా. కానీ మేముండే ప్రాంతంలో బాంబులు, ఎన్‌కౌంటర్‌ల మోత తప్ప ఇంకేం ఉండదు.. దీనికి బయపడి మా ఇంట్లోవారు నన్ను ఎక్కడికి పంపించేవారు కాదు.

ఇది నా తండ్రి ఒక్కడితోనే ఆగిపోలేదు. కశ్మీర్‌లో ఉన్న 140 మంది ప్రభుత్వ టీచర్లకు గత రెండు సంవత్సరాలుగా జీతాలు చెల్లించడం లేదు. నేను నా చదువు మధ్యలో ఆగిపోతుందని ఆత్మహత్యకు పాల్పడడం లేదు. కనీసం నా చావుతోనైనా ఇక్కడి ప్రభుత్వ టీచర్లకు జీతాలు చెల్లిస్తారని అనుకుంటున్నా. నా ఆత్మహత్య కశ్మీర్‌ ప్రభుత్వ టీచర్లకు అంకితం. నా చావుతో ఇక్కడి ప్రభుత్వం కదిలివస్తుందని ఆశిస్తున్నా.'' అంటూ బషీర్‌ ముగించాడు.

ప్రస్తుతం బషీర్‌ వీడియో కశ్మీర్‌ ప్రభుత్వంలో కలకలం రేపింది. ఇ‍ప్పటికే అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం కశ్మీర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా ఉన్న తసాదుఖ్‌ మిర్‌ ప్రభుత్వ టీచర్ల జీతాల చెల్లింపుకు సంబంధించి ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించారు.  ప్రభుత్వ టీచర్లకు ఇవ్వాల్సిన రెండేళ్ల వేతనాలను వెంటనే విడుదల చేయాలని కశ్మీర్‌ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన కొడుకు ఆత్మహత్యపై తండ్రి బషీర్‌ అహ్మద్‌ మిర్‌ స్పందిస్తూ..'' నా కొడుకు ఇలా ఆత్మహత్యకు పాల్పడుతాడని ఊహించలేదు. వాడిది చాలా సున్నితమైన మనసత్వం. తండ్రి ప్రభుత్వ టీచర్‌ అయి ఉండి కూడా ఫీజులు చెల్లించలేకపోయాడని బాధపడేవాడు.'' అంటూ ఆవేదన చెందాడు.
చదవండి: చూస్తుండగానే కూలిపోయింది.. పెద్ద ప్రమాదం తప్పింది

మరిన్ని వార్తలు