మమతా బెనర్జీకి గవర్నర్‌ లేఖ

18 Oct, 2020 16:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేస్తూ గవర్నర్‌ జగ్దీప్‌ ధంకర్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. పోలీసు రాజ్యంగా పశ్చిమ బెంగాల్‌ మారిందని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉ‍ల్లంఘన, రాజకీయ హింస, కక్షసాధింపు చర్యలు, కస్టడీ వేధింపులు పెచ్చుమీరాయని గవర్నర్‌ పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి దిద్దుబాటు చర్యలు లేవని వ్యాఖ్యానించారు.

పోలీస్‌ కస్టడీలో ఇటీవల మరణించిన మదన్‌ గొరాయిని దారుణంగా హింసించారని ఇది అమానవీయ ఘటనని అన్నారు. ఇలాంటి ఘటనలు చట్ట నిబంధనల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని సీఎంకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత పాలనకు చొరవ చూపాలని మమతా బెనర్జీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు రాజకీయ తటస్ధ వైఖరిని అవలంభించాలని, ఒత్తిళ్లకు తలొగ్గరాదని కోరారు. చదవండి : షాకింగ్‌గా ఉంది.. ఇలా జరగాల్సింది కాదు!

మరిన్ని వార్తలు