రైతు ఆందోళనలో చీలిక కలకలం 

27 Jan, 2021 17:12 IST|Sakshi

రైతు నేత వీఏం సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

తక్షణమే ఆందోళననుంచి తప్పుకుంటున్నాం

రైతు హక్కుల కోసం తమ ఉద్యమం కొనసాగుతుంది.

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల సుదీర్ఘ పోరాటంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ ఆందోళన నుంచి తక్షణమే తాము తప్పుకుంటున్నామని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ (ఏఐకేఎస్‌సీసీ) వీఎం సింగ్‌ బుధవారం ప్రకటించడం కలకలం రేపుతోంది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం మరోలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ఈ ఆందోళనను ఇకపై తాము కొనసాగించలేమని పేర్కొన్నారు. రిపబ్లిక్‌ డే రోజున జరిగిన హింస, ఘర్షణ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. (హింసను ఖండించిన రైతు సంఘాలు)

ఎర్రకోట మీద జెండా ఎగరేసి సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు. జాతీయ జెండా కోసం మన తాతలు తండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఎర్రకోటపై ఎగిరే జాతీయజెండా మన తాతల తండ్రుల త్యాగఫలం..ఆ ప్రదేశంలో నిషాద్ సాహెబ్ జెండా ఎగురవేసి దేశ గౌరవాన్ని మంట కలిపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన సమయం కంటే ముందుగానే ఎందుకు బయలుదేరడంతోపాటు, అనుమతించిన మార్గాన్ని ఎందుకు ఉల్లంఘించారని మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాము ఈ ఆందోళననుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీనిపై రాకేష్ తికాయత్ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్‌ చేశారు. అయితే రైతుల హక్కులు, కనీస మద్దతు ధర, గిట్టు బాటు ధర కోసం తమ  ఉద్యమం కొనసాగుతుంది. కానీ ఈ  ఫార్మాట్‌లో కాదని స్పష్టం చేశారు. రిపబ్లిక్‌ డే రోజున ఢిల్లీలో రైతు ట్రాక్టర్ మార్చ్ సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి తనకు, తన సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు.  (ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా)

కాగా 72వ గణతంత్ర దినోత్సవంగా సందర్భంగా రైతు ఉద్యమకారులు చేపట్టిన ట్రాక్టర్ ‌ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ర్యాలీగా వచ్చిన కొంతమంది ఎర్రకోటవైపు దూసుకురావడం, అక్కడ జెండా ఎగురవేయడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోంశాఖ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు 200మంది ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న​ పోలీసులు,  22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ముఖ్యంగా స్వరాజ్ అభియాన్‌నేత యోగేంద్ర యాదవ్‌తో పాటు దర్శన్ పాల్, రజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటా సింగ్ బుర్జ్‌గిల్, జోగిందర్ సింగ్ సహా మరికొందరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జరిగిన హింసాకాండలో 300 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు