మౌనం వీడిన ఉద్ధవ్ ఠాక్రే : కంగనాపై ధ్వజం

26 Oct, 2020 11:02 IST|Sakshi

మా ఇంట్లో తులసిని పెంచుతాం.. గంజాయి కాదు

బతుకు దెరువు కోసం  ముంబై వచ్చి..పరువు తీస్తున్నారు

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే  బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై మరోసారి ధ్వజమెత్తారు. శివసేన దసరా ర్యాలీలో ఆయన కంగనాపై పరోక్షంగా విమర్శలు చేశారు.  అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసులో తన కుమారుడు ఆదిత్య థాకరేపై వచ్చిన ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం మౌనం వీడారు.  సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటే, బిహార్‌ పుత్రుడు బలవన్మరణం చెందాడని ప్రచారం చేశారంటూ ఎద్దేవా చేశారు. అలాగే కొంతమంది మహారాష్ట్ర బిడ్డలను, ముఖ్యంగా తన కుమారుడు ఆదిత్యను కూడా దుర్భాషలాడారని ఆరోపించారు. కానీ తాము మాత్రం ఎలాంటి కళంకం లేకుండా ఉన్నామని స్పష్టం చేశారు. న్యాయం తమవైపే ఉందని ఆయన పేర్కొన్నారు.

బతుకు దెరువు కోసం ముంబైకి వచ్చిన కొంతమంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకె) అంటూ ముంబై నగరానికి అప్రతిష్టను ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు తాము ఇంట్లో తులసి మొక్కలు పెంచుతాం, గంజాయి కాదు...ఈ విషయం వారికి తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంజాయి క్షేత్రాలు వాళ్ల రాష్ట్రంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో తిండికి గతి లేక ఇక్కడకు వచ్చి డబ్బులు సంపాదించుకుని ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చి పరువు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నమ్మకద్రోహలుగా మిగిలిపోతారన్నారు. 

కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, కంగనా ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పోకె) తో పోల్చడం వివాదం రేపింది. దీంతో ఆమె  ముంబై వీడి కంగనా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ వెళ్లిపోవాలని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మండిపడ్డారు. అక్రమ నిర్మాణమంటూ కంగనా ఆఫీసును  బీఎంసీ కూల్చి వేసింది. దీనికి రూ .2 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తూ కంగనా బొంబాయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు