నదుల పరిరక్షణ సమిష్టి బాధ్యత

4 Oct, 2021 04:32 IST|Sakshi

పాఠశాలల్లో జల సంరక్షణను పాఠ్యాంశంగా చేర్చాలి

వారసత్వ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

సాక్షి, న్యూఢిల్లీ: నదులను పరిరక్షించుకోవడం అందరి సమిష్టి బాధ్యత అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నదుల పునరుజ్జీవనానికి శక్తిమంతమైన జాతీయ ప్రచార ఆవశ్యకతకు పిలుపునిచ్చారు. ఎనిమిది రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం గువాహటిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున వారసత్వ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనశాలను సందర్శించిన వెంకయ్యనాయుడు ‘ఫరెవర్‌ గువాహటి’సచిత్ర పుస్తకాన్ని (కాఫీ టేబుల్‌ బుక్‌) విడుదల చేశారు.

అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరుగుదలతో నదులు, నీటి వనరులు కలుషితం అవుతున్నాయన్నారు. ఆధునికీకరణ అన్వేషణలో అత్యాశతో మనిషి సహజ పర్యావరణ వ్యవస్థలను నాశనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల ప్రాధాన్యం ముందు తరాలు తెలుసుకోవాలంటే జలసంరక్షణను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. అనంతరం ఫేస్‌బుక్‌ వేదిక ద్వారా తమ మనోగతాన్ని పంచుకున్న ఉపరాష్ట్రపతి... బ్రహ్మపుత్ర నదిని సందర్శించిన మరుపురాన్ని అనుభవాలను వివరించారు.

బ్రహ్మపుత్ర సహజ నదీ సౌందర్యం తనను మంత్రముగ్ధుణ్ని చేసిందని, అద్భుతమైన నదీతీర ఉద్యానవనం సంతోషాన్ని, మరచిపోలేని జ్ఞాపకాలను పంచిందని తెలిపారు. లక్షలాది మందికి జీవనోపాధి అందిస్తున్న బ్రహ్మపుత్ర ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతుల్లో భాగమని వెంకయ్యనాయుడు తెలిపారు. అనంతరం, అస్సాం రాష్ట్ర కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీఈటీ–ఎంఆర్‌ఐ యంత్రాన్ని ప్రారంభించారు.అస్సాం ప్రభుత్వం, టాటా ట్రస్టుల భాగస్వామ్యంలో అమలు చేయాలని ప్రతిపాదించిన డిస్టిబ్యూటెడ్‌ కేన్సర్‌ కేర్‌ మోడల్‌ను అభినందించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు