కాంగ్రెస్‌ హెచ్చరిక.. అమితాబ్‌కు అండగా కేంద్రం

21 Feb, 2021 15:03 IST|Sakshi

నటులకు అండగా ఉంటాం : కేంద్రమంత్రి

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్, అక్షయ్‌ కుమార్‌లపై పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే చేసిన బెదిరింపులను తీవ్రం గా ఖండిస్తున్నామనీ, వారికి తమ పార్టీ పూర్తి గా రక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయక మంత్రి రాందాస్‌ అఠావలే ప్రకటించారు. ఇటీవల బండారా జిల్లాలో నిర్వ హించిన రైతు మద్దతు యాత్ర సందర్భంగా, పెట్రోల్‌ ధరల పెరుగుదల విషయంలో అమితాబ్‌ బచ్చన్, అక్షయ్‌కుమార్‌లు స్పందించనందుకు వారి సినిమాలు ప్రదర్శించకుండా అడ్డుకుంటామనీ, షూటింగ్‌లు కూడా జరగనీయమని నానా పటోలే హెచ్చరించిన నేపథ్యంలో రామ్‌దాస్‌ అఠావలే తీవ్రంగా స్పందించారు. ‘హిందీ, మరాఠీ సినీ పరిశ్రమలు ముంబై నగరానికి గౌరవ ప్రతీకలనీ, సినీ పరిశ్రమ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందనీ, వేలాది మందికి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి కలిగిస్తోందనీ, ఇలాంటి పరిశ్రమను అడ్డుకోవడం సమంజసం కాదనీ..’ ఆయన హితవు పలికారు.

‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి బెదిరింపులకు స్థానం లేదనీ, ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి బెదిరింపులను అమలు చేసినట్లయితే రిపబ్లికన్‌ పార్టీ కార్యకర్తలు రోడ్డు పైకి వచ్చి సినీ పరిశ్రమకు అండగా నిలబడతారనీ.. ముఖ్యంగా అమితాబ్, అక్షయ్‌కుమార్‌లకు రిపబ్లికన్‌ పార్టీ కార్యకర్తలు రక్షణ కవచంగా మారుతారనీ..’ ఆయన వెల్లడించారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటులు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్, అక్షయ్‌కుమార్‌లు స్పందించకుంటే వారి సినిమాలను రాష్ట్రంలో ప్రదర్శించకుండా అడ్డుకుంటామని ఎంపీసీసీ అధ్యక్షుడు నానా పటోలే హెచ్చరించిన విషయ తెలిసిందే. అంతేగాకుండా వారి షూటింగులను కూడా అడ్డుకుంటామన్నారు. 

కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా అమితాబ్‌ బచ్చన్, అక్షయ్‌ కుమార్‌లు సోషల్‌ మీడియాలో ‘మేం కార్లయితే కొనగలం కానీ, పెట్రోల్‌ కొనలేం’ అని వ్యంగ్యంగా పలు పోస్టింగ్‌లు పెట్టారనీ, అలాంటిది ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సెలబ్రిటీలు కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నటులు అండగా తాము ఉంటామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

పెట్రోల్‌ ధరల పెరుగుదల: వివాదంలో నటులు

మరిన్ని వార్తలు