New Helmet Rules: హెల్మెట్‌ రూల్స్‌ ఇకపై మరింత కఠినతరం‌.. అలా చేసినా జరిమానే!

20 May, 2022 14:46 IST|Sakshi

న్యూఢిల్లీ: బండి నడిపే వాళ్లకు హెల్మెట్‌ తప్పనిసరితో పాటు వెనకాల కూర్చునే వాళ్లకు సైతం హెల్మెట్‌ తప్పనిసరి నిబంధనలు చాలా చోట్ల అమలు అవుతున్నాయి. అయితే హెల్మెట్‌ విషయంలో మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌ కొత్త సవరణను కఠినంగా అమలు చేయబోతోంది. తేడాలొస్తే.. జరిమానాలతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ మీద వేటు తప్పదని స్పష్టం చేసింది.

నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్‌లు ధరించినా ఫైన్‌ మోత తప్పదు ఇక నుంచి. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) సర్టిఫికేషన్‌, ఐఎస్‌ఐ మార్క్‌ హెల్మెట్‌లపై తప్పక ఉండాల్సిందే.  పూర్తిస్థాయిలో రక్షణ కలిగించే హెల్మెట్‌లు మాత్రమే.. అదీ సర్టిఫైడ్‌ అయ్యి ఉండాలి. అలా లేకుంటే.. మోటర్‌ వెహికిల్స్‌ యాక్ట్‌ 1988 లోని సెక్షన్‌ 129 ఉల్లంఘనల కింద సెక్షన్‌-194డీ ప్రకారం..  వెయ్యి రూపాయల ఫైన్‌తో పాటు మూడు నెలలపాటు లైసెన్స్‌పై వేటు వేస్తారు.

ఐఎస్‌ఐ మార్క్‌ హెల్మెట్‌లను మాత్రమే టూవీలర్స్‌పై ఉపయోగించడం తప్పనిసరి చేస్తూ జూన్‌ 1, 2021లో ఆదేశాలు జారీ అయ్యాయి. నాన్‌-ఐఎస్‌ఐ హెల్మెట్‌లను బ్యాన్‌ చేసినా.. ఇప్పటికీ చాలామంది వాటినే ఉపయోగిస్తుండడం గమనార్హం.

  • బైక్‌ రైడింగ్‌లో ఉన్నప్పుడు హెల్మెట్‌ బకెల్‌, బ్యాండ్‌ గనుక పెట్టుకోకున్నా.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. 
  • ఐఎస్‌ఐ మార్క్‌, బీఎస్‌ఐ సర్టిఫికేషన్‌ లేని హెల్మెట్‌ గనుక ఉపయోగిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. 
  • హెల్మెట్‌ సక్రమంగా ధరించినా.. ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘన,  రెడ్‌ లైట్‌ జంపింగ్‌ చేయడం లాంటివాటికి కూడా 2 వేల రూపాయల జరిమానా తప్పదు.  

చదవండి: జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు

మరిన్ని వార్తలు