అతి భారీ వర్షాలు: 2న రెడ్‌ అలర్ట్‌

30 Nov, 2020 08:33 IST|Sakshi

నేడు కేంద్ర బృందం రాక..

సాక్షి, చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఒకటో తేదీ నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు కురవనున్నాయి. రెండో తేదీ అతి భారీ వర్షాలకు అవకాశాలు ఉండడంతో ముందుగానే రెడ్‌ అలర్ట్‌ ప్రకటించేశారు. నివర్‌ నష్టం తీవ్ర తను పరిశీలించేందుకు కేంద్ర బృందం సోమవారం చెన్నైకు రానుంది. నివర్‌ తుపాన్‌ తీరం దాటి నాలుగు రోజులు అవుతున్నా, చెన్నై శివార్లలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు ఇంకా తొలగలేదు.

ఈ సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఆదివారం మరింతగా బలపడింది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఒకటో తేదీ మరింతగా బలపడనున్న దృష్ట్యా, ఈ ప్రభావం రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడుపై పడనుంది. తొలుత సముద్ర తీర జిల్లాలో మోస్తరు వర్షం, రెండో తేదీ అన్ని జిల్లాల్లో అతి భారీ వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండో తేదీన బురేవి తుపాన్‌గా మారి అతి భారీ వర్షాలు పడే అవకాశాలను  దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఆదివారం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో అధికార వర్గాలు ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టే పనిలోపడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.  చదవండి: (మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..)

నేడు కేంద్ర బృందం రాక.. 
నివర్‌ రూపంలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, రాష్ట్రంలోని కడలూరు, విల్లుపురంలలో ప్రభా వం ఎక్కువే. మిగిలిన జిల్లాల్లో వర్షాలు ఆశాజనకంగానే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో నివర్‌ రూపంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేసి, కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు సోమవారం ప్రత్యేక బృందం చెన్నైకు రానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశుతోష్‌ అగ్నిహోత్రి నేతృత్వంలో ఏడు గురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. రాత్రి చెన్నైకు వచ్చే ఈ బృందం మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగంతో భేటీ అవుతుంది. ఆ తర్వాత నివర్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. చివరగా చెన్నైలో సీఎం పళనిస్వామితో ఈ బృందం భేటీ అవుతుంది. ఈ బృందం ఇచ్చే నివేదిక మేరకు కేంద్రం సాయం ప్రకటించనుంది.

ఈ తుపాన్‌ కారణంగా పెను నష్టం జరగనట్టు అధికారుల పరిశీలనలో తేలింది. కొంత మేరకు నష్టం ఉండడంతో ఆ వివరాలతో నివేదికను ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు. ఆ మేరకు నలుగురు మరణించినట్టు,  ఐదుగురు గాయపడ్డట్టు తేల్చారు. 14 ఎకరాల అరటి పంట పూర్తిగా దెబ్బతింది. పది వేల హెక్టార్లలోని పంటల్లో  వరద నీళ్లు చొచ్చుకెళ్లాయి. 108 విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. 2,927 స్తంభాలు ఒరిగాయి. 199 ఇళ్లు దెబ్బ తిన్నాయి. 1,439 గుడిసెలు పాక్షికంగా దెబ్బ తినగా, 302 గుడిసెలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 245 పశువులు మరణించాయి. 2,064 చెట్లు నేలకొరిగాయి. 4,139 శిబి రాల్లో 2.32 లక్షల మంది సురక్షితంగా ఉన్నట్టు తాజా నివేదికలో పేర్కొన్నారు.   చదవండి: (మరో వాయు‘గండం’)

సెంబరంబాక్కం గేట్లతో.. 
ఈనెల 26న సెంబరంబాక్కం గేట్లను తెరిచిన విషయం తెలిసిందే. తొలిరోజు 9 వేల గణపుటడుగుల మేరకు నీళ్లు వదిలారు. ఆ తర్వాత వర్షాలు ఆగడం, నీటి రాక తగ్గడం వెరసి గేట్లను మళ్లీ మూయడానికి అధికారులు సిద్ధమయ్యారు. తెరిచిన గేట్ల వద్ద చెట్ల కొమ్మలు, వేర్లు చుట్టుకుని ఉండడంతో మూత కష్టతరంగా మారింది. దీంతో ఆదివారం ఉదయాన్నే భారీ క్రేన్లను రప్పించి, గేట్లకు చుట్టుకెళ్లి ఉన్న వేర్లను, కొమ్మలను తొలగించే పనిలో పడ్డారు. దీంతో జలాశయం నుంచి వృథాగా 350 గణపుటడుగుల మేరకు నీళ్లు బయటకు వెళ్తున్నాయి.

చెన్నైకు నీళ్లు అందించే సెంబరంబాక్కంలో 22 అడుగులు, పూండిలో 34 అడుగులు, తేర్వాయి కండ్రిలో 22 అడుగులు, చోళవరంలో పది అడుగులు, పుళల్‌లో 19 అడుగులు, వీరానంలో 8 అడుగుల మేరకు నీళ్లు తాజా వర్షాలకు వచ్చి చేరాయి. అన్ని చెరువులు నిండే స్థాయిలోనే ఉండడంతో ఈ వేసవిలో చెన్నైకు తాగు నీటికి ఢోకా లేదు. కడలూరు జిల్లా కాట్టుమన్నార్‌ కోయిల్‌ పరిసరాల్లోని నీటి పరివాహక ప్రాంతాలు, చెరువుల్లోకి తాజా వరదల రూపంలో మొసళ్లు వచ్చి చేరి ఉండడంతో ఆ పరిసర వాసుల్లో ఆందోళన తప్పడం లేదు. ఉత్తర చెన్నైలో భారీ వర్షాల సమయంలో కొట్టుకెళ్లిన కొళత్తూరుకు చెందిన మహబూబ్‌ భాష మృతదేహం ఆదివారం మాధవరం సమీపంలోని కాలువలో బయటపడింది.  

మరిన్ని వార్తలు