వరుడికి సోకిన కరోనా.. అర్ధంతరంగా ఆగిన వివాహం

30 Jul, 2021 20:16 IST|Sakshi

లక్నో: పెళ్లంటే ఒక తెలియని ఆనందం. పెళ్లిపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఓ జంట పెళ్లి చేసుకునే వేళ ఊహించని ట్విస్ట్‌ వచ్చి పడింది. కొన్ని గంటల్లో ఇద్దరు ఒక్కటవుతున్నారని అనుకుంటున్న సమయంలో ఊహించని ట్విస్ట్‌ వచ్చి పడి ఆ పెళ్లి వాయిదా పడింది. వారి పెళ్లికి అడ్డంకిగా నిలిచింది ఏమిటో కాదు మహమ్మారి కరోనా. బాజభజంత్రీలతో ఉత్సాహంగా ఊరేగింపుగా బయల్దేరిన వరుడికి పాజిటివ్‌ తేలింది. దీంతో మండపంలో ఉండాల్సిన అతడు హోం ఐసోలేషన్‌కు వెళ్లాడు. ఆగిపోయిన పెళ్లి వార్త విశేషాలు మీరే చదవండి.

ఉత్తరాఖండ్‌లోని ఖటిమా ప్రాంతానికి చెందిన ముంతాజ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ జిల్లా చందోయ్‌ గ్రామానికి చెందిన మల్మాతో వివాహం నిశ్చయమైంది. గురువారం జరగాల్సిన పెళ్లి కోసం వరుడు, వారి కుటుంబసభ్యులు బరాత్‌ నిర్వహించుకుంటూ వధువు గ్రామం చందోయ్‌కు బయల్దేరారు. రాష్ట్ర సరిహద్దులో వీరిని పోలీసులు అడ్డగించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెగటివ్‌ ఉన్నవారినే యూపీలోకి అడుగు పెట్టనిస్తున్నారు. ‘సార్‌ పెళ్లి ఉంది.. వదిలేయండి’ అని ఎంత బతిమిలాడినా పోలీసులు వినిపించుకోలేదు. చివరకు విసుగు చెంది అక్కడే సరిహద్దులో పరీక్షలు చేయించుకున్నారు. 41 మందికి పరీక్షలు చేయించుకోగా అందరికీ నెగటివ్‌ వచ్చింది. 

కానీ ఆ ఒకరికి మాత్రం పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అది కూడా వరుడికి పాజిటివ్‌ రావడంతో కుటుంబసభ్యులతో పాటు పోలీసులు షాక్‌కు గురయ్యారు. పెళ్లి ఉండడంతో జాలిపడి పోలీసులు మూడుసార్లు పరీక్షలు చేశారు. మూడింటిలోనూ పాజిటివ్‌ అని తేలింది. దీంతో వరుడికి కరోనా సోకిందని నిర్ధారించారు. వెంటనే బంధువులను వెనక్కి పంపించారు. వరుడిని ఐసోలేషన్‌ కేంద్రానికి పంపించారు. ఈ విషయాన్ని వధువు కుటుంబసభ్యులకు చేరవేశారు. ఈ హఠాత్పరిణామానికి వారు అవాక్కయ్యారు. చివరకు చేసేదేమీ లేక పెళ్లిని వాయిదా వేశారు. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీ పెళ్లి మా సావుకొచ్చింది’ అంటూ కరోనా భయంతో బంధువులు వెనక్కి తగ్గారు. 

మరిన్ని వార్తలు