వెరైటీ వెడ్డింగ్‌: 4 గంటలు బెయిల్‌.. జైలులో యువతి వివాహం

27 Mar, 2023 14:51 IST|Sakshi

స్నేహం, ప్రేమ.. వీటి కోసం మనకు నచ్చిన వాళ్లని ఎంచుకుంటుంటాం, అయితే పెళ్లి విషయంలో మాత్రం అలా కుదరదు. ఎందుకంటే వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయని మన పెద్దలు అంటుంటారు. అందుకు తగ్గట్టే కొందరికి ఊహించని రీతిలో వివాహాలు కూడా జరుగుతుంటాయి. ఇటీవల ఓ యువతి పెళ్లి ఈ తరహాలోనే జైలులో జరిగింది. అసలేం జరిగిందంటే.. పశ్చిమ చంపారన్‌లోని బగాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్‌గావ్ గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ హాజీపూర్‌లో ఇంజనీరింగ్ చదివాడు. రాహుల్ తన కుటుంబంతో కలిసి లక్నోలో సత్సంగానికి వెళ్లాడు.

జైలులో పెళ్లి...
అక్కడ అతనికి యూపీలోని కప్తంగంజ్‌కు చెందిన 21 ఏళ్ల కాజల్ ప్రజాపతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ గోపాల్‌గంజ్‌లోని తావే దుర్గా గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా జీవితం మొదలుపెట్టారు. ఇటీవల మార్చి 5న కాజల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను రాహుల్ ఆసుపత్రిలో చేర్చాడు. అయితే విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను తీసుకుని అక్కడికి చేరుకున్నారు. రాహుల్ కుమార్‌పై అత్యాచారం చేశాడని ఆరోపణలతో పోలీసులతో అతడిని అరెస్ట్ చేయించి జైలుకు తరలించారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. చివరికి వారిద్దరికి పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. అయితే రాహుల్‌ జైలులో ఉండడంతో గోపాల్‌గంజ్‌లోని సీజేఎం కోర్టులో కుటుంబం తరపున ఒక దరఖాస్తు దాఖలు చేశారు.

ఇద్దరూ మేజర్లు కావడంతో కోర్టు పెళ్లికి అనుమతించింది. దీంతో అతని పెళ్లికి నాలుగు గంటల పెరోల్ బెయిల్ లభించింది. గోపాల్‌గంజ్‌లోని చనావే జైలు నుంచి నాలుగు గంటలపాటు పెరోల్‌పై వచ్చిన ఓ ఖైదీ తావే దుర్గా ఆలయంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. తావే దుర్గా ఆలయంలో జరిగిన ఈ అపూర్వ వివాహానికి అబ్బాయి, అమ్మాయితో పాటు పోలీసులు కూడా పెళ్లికి అతిథులుగా హాజరయ్యారు. ఆలయంలో వివాహ వేడుక తర్వాత, థావే వాలి కోర్టులో దంపతులు భార్యాభర్తలుగా నిర్ధారించింది. తావే దుర్గ గుడిలో ఓ నేరస్థుడి వివాహ వేడుక సందర్భంగా భారీ సంఖ్యలో పోలీసులు కూడా బందోబస్తులో ఉన్నారు. అమ్మవారి ఆలయంలో జరిగిన ఈ వినూత్న వివాహం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు