ఢిల్లీలో వీకెండ్‌ కర్ఫ్యూ

16 Apr, 2021 05:35 IST|Sakshi
ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జైప్రకాశ్‌ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర సర్కారు నిర్ణయం

ఈ నెల 16 రాత్రి నుంచి 19 ఉదయం వరకూ కర్ఫ్యూ అమలు

ఏప్రిల్‌ 30 దాకా మాల్స్, జిమ్స్, స్పాలు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌ మూసివేత

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం వీకెండ్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఆయన గురువారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తో సమావేశమయ్యారు. తాజా పరిస్థితిను ఆయనకు తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఢిల్లీలో ఈ నెల 16న రాత్రి 10 గంటల నుంచి 19న ఉదయం 6 గంటల వరకు వీకెండ్‌ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఢిల్లీలో 5 వారాల్లో కరోనా కేసులు 25 రెట్లు పెరిగాయి.  

మినహాయింపులు ఎవరికి..
వీకెండ్‌ కర్ఫ్యూ సమయంలో జరుగబోయే వివాహాలకు ఆంక్షలతో కూడిన అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. కర్ఫ్యూ సమయంలో వివాహాలకు హాజరయ్యేందుకు ప్రజలు ఈ–పాస్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మాల్స్, జిమ్‌లు, స్పాలు, ఆడిటోరియంలు, మార్కెట్లు, ప్రైవేట్‌ కార్యాలయాలను  30వ తేదీ వరకు పూర్తిగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా హాళ్లను 30 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో నడిపించేందుకు అవకాశం ఇచ్చారు. రెస్టారెంట్లలో భోజనం చేసేందుకు అనుమతి లేదు. కేవలం హోమ్‌ డెలివరీ మాత్రమే ఉంటుంది.  

ఆసుపత్రుల్లో పడకల కొరత ఏం లేదు: కేజ్రీవాల్‌
కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని అన్నారు.  బాధితుల కోసం 5,000 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు