Covid: దేశంలోనే తొలి మహిళగా నిలిచిన జ్యోత్స్న బోస్‌

21 May, 2021 14:36 IST|Sakshi
కరోనాపై వైద్య పరిశోధనల కోసం శరీరాన్ని దానం చేసిన దేశంలోనే తొలి మహిళ జ్యోత్స్న బోస్‌

వైద్య పరిశోధనల కోసం శరీరాన్ని దానం చేసిన వృద్ధురాలు

కోల్‌కతా: కోవిడ్‌ ఎందరినో బలి తీసుకుంది. ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. రూపు మార్చుకుంటూ.. ఆనవాలు చిక్కకుండా జనాలను అంతం చేస్తుంది. వైరస్‌ సోకిన వారిలో ఎలాంటి మార్పలు చోటు చేసుకుంటున్నాయి.. ఏ అవయవాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియాలి అంటే.. మహమ్మారి బారిన పడి  మరణించిన వారి శరీరాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించాలి. కానీ మన దగ్గర చాలా మంది చనిపోయిన వారి శరీరాలను ఇలాంటి ప్రయోగాలకు ఇవ్వడానికి ఒప్పుకోరు. 

ఈ క్రమంలో కోల్‌కతాకు చెందిన 93 సవంత్సరాల వృద్ధురాలు వైద్య పరిశోధనల కోసం తన శరీరాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దేశంలో కరోనాపై వైద్య పరిశోధనల కోసం శరీరాన్నీ దానం చేసిన తొలి మహిళగా నిలిచారు. ఇక ఆమె మృతదేహం మీద కరోనా వల్ల మానవ శరీరంలో కలిగే ప్రభావాలను గుర్చి అధ్యయనం చేశారు. 

ఆ వివరాలు.. పశ్చిమబెంగాల్‌కు చెందిన ట్రేడ్‌ యూనియన్‌ నాయకురాలు జ్యోత్స్న బోస్‌(93) కొద్ది రోజుల క్రితం కోవిడ్‌తో మరణించారు. అయితే పదేళ్ల క్రితమే ఆమె మరణించిన తర్వాత తన శరీరాన్ని రాయ్‌ ఆర్గనైజేషన్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె కోవిడ్‌తో మరణించారు. ఇక ఆమె నిర్ణయం మేరకు కుటుంబ సభ్యులు జ్యోత్స్నా బోస్ శరీరాన్ని వైద్య పరిశోధనల కోసం ఆర్‌జీకార్‌ మెడికల్‌ కాలేజీకి అప్పగించారు. 

ఈ సందర్భంగా ఆమె మనవరాలు, పాథాలజీలో ఎండీ చేస్తున్న డాక్టర్ టిస్టా బసు మాట్లాడుతూ.. ‘‘కోవిడ్‌ బారిన పడిన మా నానమ్మను ఈ నెల 14న ఉత్తర కోల్‌కతాలోని బెలియాఘాట ప్రాంతంలోని ఆసుపత్రిలో చేర్పించామని, రెండు రోజుల తరువాత ఆమె మరణించారు. ఇక మా నానమ్మ నిర్ణయం మేరకు ఆమె మృతదేహానికి ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌లో పాథలాజికల్‌ శవ పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్‌ కొత్త వ్యాధి.. దీని గురించి నేటికి కూడా మనకు పూర్తిగా తెలియదు. అవయవాలు, అవయవ వ్యవస్థలపై దాని పూర్తి ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ అన్వేషణలో పాథలాజికల్ శవపరీక్షలు మాకు సహాయపడతాయి’’ అని తెలిపారు. 

లాభాపేక్షలేని సంస్థ 'గందర్‌పాన్' విడుదల చేసిన ఒక ప్రకటనలో, వైద్య పరిశోధనల నిమిత్తం కోవిడ్‌ వల్ల మరణించిన అనంతరం తమ శరీరాలను ఇచ్చిన వారిలో బోస్ దాని వ్యవస్థాపకుడు బ్రోజో రాయ్ మొదటి వ్యక్తి కాగా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జ్యోత్స్న బోస్‌ రెండవ వ్యక్తిగా నిలిచారు. కోవిడ్‌తో మరణించిన ఆమె శరీరంపై నిర్వహించిన రోగలక్షణ శవపరీక్షను ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించారు. కరోనా బారిన పడి మరణించిన మరో నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ బిస్వాజిత్ చక్రవర్తి అవశేషాలు కూడా ఇదే ప్రయోజనం కోసం విరాళంగా ఇవ్వబడ్డాయి. తద్వారా అతను రాష్ట్రంలో మూడవ వ్యక్తిగా నిలిచాడు.

మరిన్ని వార్తలు