ఆడియో క్లిప్‌ వైరల్‌: ‘నందిగ్రామ్‌లో సాయం చేయండి’

27 Mar, 2021 16:16 IST|Sakshi

కోల్‌కత్తా: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం తొలి దశ పోలింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే తనను ఎలాగైనా గెలిపించాలని ఏకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను వేడుకున్నారని ఓ బీజేపీ నాయకుడు చేస్తున్న ఆరోపణలు హాట్‌ టాపిక్‌గా మారాయి. తృణమూల్‌లోకి తిరిగొచ్చేసేయ్‌.. నా గెలుపునకు కృషి చేయి అని తనను విజ్ఞప్తి చేశారని ఆ నాయకుడు ప్రకటించాడు. ఈ మేరకు సీఎం తనకు ఫోన్‌ చేశారని దానికి సంబంధించిన ఫోన్‌ కాల్‌ వైరల్‌గా మారింది.

మమత బెనర్జీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే తనకు రాజకీయంగా పేరు తీసుకొచ్చిన నందిగ్రామ్‌ నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ నుంచి సువేందు అధికారి ప్రత్యర్థిగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. అయితే సువేందు అధికారి వర్గానికి చెందిన ప్రళయ్‌ పాల్‌కు మమతా ఫోన్‌ చేశారని ఆరోపిస్తున్న ఓ ఆడియో కాల్‌ లీకయ్యింది. ప్రళయ్‌తో ఫోన్‌ సంభాషణలో మమతా ‘నందిగ్రామ్‌లో సహకరించాలి’ అని విజ్ఞప్తి చేస్తున్నట్టు ఉంది. ఈ విషయాన్ని ప్రళయ్‌ పాల్‌ శనివారం మీడియా సమావేశంలో విడుదల చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు తెలిపాడు. 

బీజేపీ నందిగ్రామ్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రళయ్‌ పాల్‌ సువేందు అధికారికి నమ్మిన బంటు. నందిగ్రామ్‌లో తనకు ప్రచారం చేయాలని మమతా కోరినట్లు ప్రళయ్‌ తెలిపాడు. మళ్లీ తృణమూల్‌లోకి రా.. సువేందుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పాడు. అయితే మమత విజ్ఞప్తిని తాను తిరస్కరించానని ప్రళయ్‌ చెప్పుకొచ్చాడు. అధికారి కుటుంబంతో తనకు అవినాభావ సంబంధం ఉందని.. తాను అలా చేయలేనని చెప్పినట్లు వివరించాడు.  బీజేపీ కోసమే పని చేస్తానని స్పష్టం చేశాడు. సీపీఎం పాలనలో నందిగ్రామ్‌లో మమ్మల్ని హింసించినప్పుడు సువేందు అధికారి కుటుంబం అండగా ఉందని ఫోన్‌లో ప్రళయ్‌ చెప్పాడు. తాను ఆ పని చేయలేనని చెప్పినట్లు ప్రళయ్‌ మీడియా సమావేశంలో చెప్పాడు. అయితే ఇది మమతా ఫోన్‌ కాల్‌ అని ఎవరూ నిర్ధారించడం లేదు. తొలి దశలో లబ్ధి పొందేందుకు ఈ విధంగా బీజేపీ కుట్ర పన్ని ఫేక్‌ కాల్స్‌ రూపొందిస్తున్నాయని అధికార పార్టీ నాయకులు మండిపడుతున్నారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. తృణమూల్‌ ధీటుగా సమాధానం ఇస్తోంది. 

బెంగాల్‌లో 8 దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 294 సీట్లలో తొలి దశలో భాగంగా 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 2వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.

మరిన్ని వార్తలు