పరీక్షలు వాయిదా వేయండి: మమతా బెనర్జీ

24 Aug, 2020 12:43 IST|Sakshi

కోల్‌కతా: విద్యార్థుల క్షేమం దృష్ట్యా జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(ఎన్‌ఈఈటీ–నీట్‌), సంయుక్త ప్రవేశ పరీక్ష (జేఈఈ)- 2020 పరీక్షలను వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో పరిస్థితులు చక్కబడేంత వరకు వేచి చూడాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబరులో నీట్‌, జేఈఈ నిర్వహించాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో మరోసారి నేను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రమాద తీవ్రతను అంచనా వేసి, పరీక్షలు వాయిదా వేయాలి. విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించడం మన బాధ్యత’’ అని పేర్కొన్నారు. 

కాగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మమత ఇదే అభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ గైడ్‌లైన్స్‌పై ఆమె అభ్యంతరాలు లేవనెత్తారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ సైతం పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆదివారం ప్రధాని మోదీని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే నీట్‌, జేఈఈ జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కోవిడ్‌ కారణంగా పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. (జేఈఈ, నీట్‌ పరీక్షలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు)

ఇక నీట్‌ ఎగ్జామ్‌కు సుమారు 16 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా సంక్షోభ నేపథ్యంలో కేంద్ర గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్‌ ఏర్పాట్లను చేయనున్నారు. ప్రతి విద్యార్థికి తాజా మాస్కులు, గ్లౌవ్స్‌ను అందించి సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం సమాయత్తమవుతోంది. 

మరిన్ని వార్తలు