అంత్యక్రియలు అయిన వారానికి.. ‘బతికాడు’

23 Nov, 2020 17:02 IST|Sakshi

కోల్‌కతా: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ కుటుంబం తీవ్ర మనోవేదనను అనుభవిస్తోంది. కుటుంబ సభ్యుడు మరణించాడంటూ వేరే వ్యక్తి మృతదేహం వారికి అప్పగించారు. అంత్యక్రియలు పూర్తయిన వారం రోజుల తర్వాత వారి కుటుంబ సభ్యుడు బతికే ఉన్నాడని తెలిసింది. దాంతో వారు ఆస్పత్రి‌ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. శిబ్దాస్‌ బెనర్జీ(75) అనే వృద్ధుడికి కరోనా సోకడంతో ఈ నెల 4న బలరాంపూర్‌ బసు ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అదే రోజున మోహినిమోహన్‌ ముఖర్జీ(75) అనే వ్యక్తి కూడా కోవిడ్‌ బారిన పడి బెనర్జీ చేరిన ఆస్పత్రిలోనే చేరారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ 13న ఆస్పత్రి సిబ్బంది బెనర్జీ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి అతడు చనిపోయాడని తెలిపారు. అనంతరం ముఖర్జీ మృతదేహాన్ని వారికి అప్పగించారు. కరోనాతో మృతి చెందడంతో మృతదేహాన్ని ప్రొటెక్టివ్‌ మెటిరియల్‌తో పూర్తిగా చుట్టి వారికి అందించారు. దాంతో లోపల ఉన్నది బెనర్జీనే అని భావించారు. వెంటనే ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. (చదవండి: ప్రపంచానికి పెను సవాలు.. కరోనా)

వారం రోజుల తర్వాత బెనర్జీకి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తుండగా ఆస్పత్రి సిబ్బంది వారికి కాల్‌ చేసి అతడు బతికే ఉన్నాడని.. పొరపాటున వేరే వారి మృతదేహం అప్పగించామని తెలిపారు. ఇది విని కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. బెనర్జీ బతికే ఉన్నాడని తెలిసి ఆనందపడ్డారు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డీన్‌ మాట్లాడుతూ.. ‘బెనర్జీ ఆస్పత్రిలో చేరిన రోజునే ముఖర్జీ కూడా చేరారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం ముఖర్జీని బర్సాత్‌కు తరలించాం. అయితే బై మెస్టేక్‌ సిబ్బంది ముఖర్జీకి బదులు బెనర్జీ మెడికల్‌ రిపోర్టును బర్సాత్‌కు పంపించారు. ఈ క్రమంలో ముఖర్జీ చనిపోవడంతో మెడికల్‌ రిపోర్టుల ప్రకారం అతడి మృతదేహాన్ని బెనర్జీ కుటుంబ సభ్యులకు అందించాము.  ఈ లోపు బలరాంపుర్‌ బసు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెనర్జీ కోలుకున్నారు. దాంతో అధికారులు ముఖర్జీ కుటుంబ సభ్యులకు కాల్‌ చేసి సమాచారం ఇవ్వడంతో వారు చేసిన తప్పిదం వెలుగులోకి వచ్చింది’ అన్నారు.

ఆస్పత్రికి వచ్చిన ముఖర్జీ కుటుంబ సభ్యులు అక్కడ వేరే వ్యక్తి ఉండటంతో దీని గురించి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వారు మెడికల్‌ రిపోర్టులు మారడంతో సమస్య తలెత్తిందని గుర్తించి బెనర్జీ ఇంటికి కాల్‌ చేసి అతడు బతికి ఉన్న విషయాన్ని తెలిపారు. వచ్చి తీసుకేళ్లాల్సిందిగా సూచించారు. ఇక అధికారుల నిర్లక్ష్యం పట్ల ఇరు కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు