మెట్రోసేవ‌ల పున‌రుద్ద‌ర‌ణ‌కు సిద్ధంగా ఉన్నాం

29 Aug, 2020 16:45 IST|Sakshi

కోల్‌క‌తా :  అన్‌లాక్‌లో భాగంగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో మెట్రో స‌ర్వీసుల‌కు అనుమ‌తివ్వాల‌ని కోరుతూ  ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ రైల్వే బోర్డుకు లేఖ రాశారు. అన్ని భ‌ద్ర‌తా ప్ర‌మాణాల మ‌ధ్య ప‌రిమిత సంఖ్య‌లో మెట్రో సేవ‌ల‌ను  తిరిగి ప్రారంభించేలా అనుమ‌తివ్వాల‌ని  కోరారు. ఈ విష‌యంపై రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయ మాట్లాడుతూ పూర్తి భ‌ద్ర‌తా ప్ర‌మాణాల మ‌ధ్య నాలుగోవంతు స‌బ‌ర్బ‌న్ రైళ్ల స‌ర్వీసుల‌ను, మెట్రో సేవ‌ల‌ను ప్రారంభించేందుకు రాష్ర్ట ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. (కోవిడ్‌ నిబంధనలను పాటించకపోతే భారీ జరిమానాలు)

ఇప్ప‌టికే బ‌స్సు స‌ర్వీసుల‌కు అనుమ‌తి క‌ల్పించిన నేప‌థ్యంలో మెట్రో సేవ‌ల‌ను కూడా పునః ప్రారంభించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. అయితే ఈ సేవ‌ల‌ను ఎప్ప‌టినుంచి తిరిగి ప్రారంభించాల‌న్న‌దానిపై బెంగాల్ ప్ర‌భుత్వం ఎలాంటి స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు. ఇక క‌రోనా వ్యాప్తిని నివారించే ప్ర‌య‌త్నంలో భాగంగా బెంగాల్‌లో మ‌రో రెండు వారాల పాటు ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది. అంతేకాకుండా జూలై 23 నుంచి ప్ర‌తీవారం కంప్లీట్ లాక్‌డౌన్‌ను ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే రాష్ర్ట ఆర్థిక ప‌రిస్థితి క్ర‌మంగా క్షీణిస్తున్నందున మెట్రో సేవ‌లు తిరిగి ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రైల్వే బోర్డుతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. (స్వీయ నిర్బంధంలోకి పంజాబ్‌ ముఖ్యమంత్రి)

మరిన్ని వార్తలు