విద్యార్ధులకు క్రెడిట్ కార్డులు.. రూ.10 లక్షల వరకు పరిమితి

30 Jun, 2021 20:41 IST|Sakshi

పథకం ప్రారంభించిన మమతా బెనర్జీ

కోల్‌కతా: విద్యార్థులకు రుణసాదుపాయం కల్పించేందుకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్టూడెంట్ క్రెడిట్ కార్డ్’ పథకాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రారంభించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు  దీదీ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇదొక అద్భుత పథకమని ఈ సందర్భంగా మమత తెలిపారు.

స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా  4 శాతం వార్షిక సాధారణ వడ్డీతో  10 ల‌క్ష‌ల రూపాయల వ‌ర‌కు రుణం పొందవచ్చునని చెప్పారు. పదేళ్లుగా బెంగాల్ లో నివసించే విద్యార్థులు (గరిష్ఠ వయసు 40 ఏళ్లు) ఈ కార్డు పొందేందుకు అర్హులని మమత తెలిపారు. అండర్ గ్రాడ్యేయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, వైద్య విద్య చదివేవారికి ఈ కార్డు ద్వారా రుణం లభిస్తుందని చెప్పారు.

దేశ, విదేశాల్లో చదువుకునేందుకు విద్యార్థులకు ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడికల్, లా, ఐఎఎస్, ఐపిఎస్‌,  ఇతరు పోటీ పరీక్షలకు కోచింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు కూడా ఈ పథకం కింద రుణం పొందవచ్చన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా రాష్ట్ర సహకార బ్యాంకుల నుంచి ఈ ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చన్నారు. తీసుకున్న రుణాన్ని 15 సంవత్సరాల్లోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సకాలంలో వడ్డీని పూర్తిగా చెల్లిస్తే రుణగ్రహీతలకు ఒక శాతం వడ్డీ రాయితీ ఇస్తామని ఆమె తెలిపారు. కాగా, దేశంలో స్టూడెంట్ క్రెడిట్ కార్డులు తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది.
చదవండి: శశికళపై మరో కేసు నమోదు..

మరిన్ని వార్తలు