మెడలో గుచ్చుకున్న త్రిశూలం.. అలాగే 65 కి.మీ. ప్రయాణించి..

6 Dec, 2022 21:21 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. మెడలోకి గుచ్చుకున్న త్రిశూలంతో ఓ వ్యక్తి ఏకంగా 65 కిలోమీటర్లు ప్రయాణించాడు. కళ్యాణి ప్రాంతానికి చెందిన భాస్కర్‌ రామ్‌కు గత వారం కోల్‌కతాలోని నీలరతన్‌ సర్కార్‌ మెడికల్‌ కాలేజీలో అత్యవసర శస్త్ర చికిత్స జరిగింది. మెడకు త్రిశూలం గుచ్చుకున్న ఉన్న ఫోటోలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో త్రిశూలం వ్యక్తి మెడకు కుడివైపు నుంచి గుచ్చుకొని ఎడమ వైపుకు బయటకు దిగింది.

గొంతు దగ్గర ఇరుక్కుపోయిన త్రిశూలాన్ని బయటకు తీసేందుకు అతను కళ్యాణి ప్రాంతం నుంచి కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజీకి 65 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. గొంతు దగ్గర  చిక్కుకున్న త్రిశూలంతో యువకుడు నవంబర్‌ 28 తెల్లవారుజామున తమ వద్దకు వచ్చినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 30 సెంటిమీటర్ల పొడవున్న త్రిశూలం గుచ్చుకొని, మెడపై రక్తం కారుతున్న స్థితిలో రామ్‌ని చూసిన వైద్య సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు పేర్కొన్నారు.

అయితే భాస్కర్ రామ్ ప్రాణాలతో బయటపడడంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్రిశూలం శరీర అవయవాలు, సిరలు,ధమనులను డ్యామెజ్‌ చేయకపోవడంతో ఈ కేసు మెడికల్‌ వండర్‌గా భావిస్తున్నారు. అంతర్గతంగా కూడా పెద్దగా నష్టం జరగలేదని వైద్యులు తెలిపారు. కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు త్రిశూలాన్ని తొలగించేందుకు అత్యవసర శస్త్ర చికిత్స చేశారు. కంటి-ముక్కు-గొంతు(ఈఎన్‌టీ)స్పెషలిస్ట్ డాక్టర్,అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ప్రణబాసిస్ బంద్యోపాధ్యాయ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. కొన్ని గంటలపాటు సాగిన ఈ  శస్త్రచికిత్సలో చివరకు రోగి మెడ నుంచి త్రిశూలాన్ని తొలగించారు.

గాయంతో అంత దూరం ప్రయాణం చేసినప్పటికీ రామ్‌ తనకు ఎలాంటి నొప్పి లేదని చెప్పాడని వైద్యులు వెల్లడించారు. అంతేగాక ఆపరేషన్‌ ముందు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే బాధితుడికి త్రిశూలం ఎలా గుచ్చుకుందనే దానిపై స్పష్టత లేదు.

150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ త్రిశూలాన్ని శ్రీ రామ్ తన ఇంట్లోని దేవుని బలిపీఠంపై ఉంచారని, తరతరాలుగా ఈ చారిత్రక త్రిశూలాన్ని పూజిస్తూ వస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓ వ్యక్తితో భాస్కర్ రామ్‭కు చిన్న వాగ్వాదం జరిగిందని, దీంతో అతడు త్రిశూలంతో దాడి చేయడంతో భాస్కర్ రామ్‭ మెడ వెనుక భాగంలో గుచ్చుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో ఆప్‌కు ఎదురుదెబ్బ.. స్పందించిన కేజ్రీవాల్‌

మరిన్ని వార్తలు