టీచర్ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో బెంగాల్‌ మంత్రి అరెస్ట్‌.. అసలు సినిమా ముందుంది: బీజేపీ

23 Jul, 2022 10:25 IST|Sakshi

కోల్‌కతా: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పశ్చిమ బెంగాల్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో శనివారం ఉదయం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. 

కోల్‌కతాలోని నివాసంలో సుమారు 26 గంటలకు పైగా ఆయన్ని ప్రశ్నించిన ఈడీ.. చివరకు ఈ ఉదయం అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం అంతా విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి పరేష్‌ అధికారే, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య.. తదితరుల ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగాయి. అదే సమయంలో పార్థాతో దగ్గరి సంబంధాలున్న అర్పిత ముఖర్జీ ఇంట్లో సైతం తనిఖీలు చేపట్టి.. సుమారు రూ. 20 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. 

పరిశ్రమలు, వాణిజ్య శాఖలతో పాటు పార్థా ఛటర్జీ.. టీఎంసీ సెక్రెటరీ జనరల్‌గానూ వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ అవినీతితో పాటు తన శాఖల్లోనూ ఆయన అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

పిక్చర్‌ అబీ బాకీ హై.. 
ఈడీ దాడులను బీజేపీ చేపట్టిన కుట్రపూరిత చర్యగా టీఎంసీ ఆరోపించింది. అయితే దీనికి బీజేపీ గట్టి కౌంటరే ఇచ్చింది. అసలు సినిమా ముందు ముందు ఉందంటూ ప్రతిపక్ష నేత సువెందు అధికారి ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

  

చదవండి: అర్పిత.. మంత్రిగారికి బాగా క్లోజ్‌! 

మరిన్ని వార్తలు