ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాం.. వదిలేయండి.. కోర్టులో ఏడ్చిన పార్థ చటర్జీ, అర్పిత

14 Sep, 2022 20:28 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పార్థ చటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ కోర్టు ఎదుట బోరున విలపించారు. ఈడీ అరెస్టు అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరిద్దరూ బుధవారం కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు.

'ప్రజల్లో నా ఇమేజ్‌ గురించి ఆందోళనగా ఉంది. నేను ఎకనామిక్స్ స్టూడెంట్‌ను. మంత్రి కావడానికి ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నా. రాజకీయాలకు నన్ను బలిపశువును చేశారు. ఈడీ అధికారులను నా ఇంటిని సందర్శించమనండి. నా నియోజకవర్గానికి వెళ్లమనండి. నేను ఎల్‌ఎల్‌బీ చేశాను. బ్రిటిష్ స్కాలర్‌షిప్ కూడా పొందాను. నా కూతురు యూకేలో నివసిస్తోంది. అలాంటిది ఇలాంటి స్కామ్‌లో నేను ఎందుకు పాలుపంచుకుంటాను?' అని కోర్టుకు పార్థ చటర్జీ తెలిపారు. బెయిల్‌ కోసం విజ్ఞప్తి చేసిన ఆయన.. కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని, ఎలాంటి షరతులతో అయినా బెయిల్ మంజూరు చేయాలాని కోరారు. తాను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నానని, దయచేసి తనకు బెయిల్ ఇవ్వాలని ప్రాధేయపడ్డారు.

నాకేం తెలియదు..
పార్థ చటర్జీ అనంతరం కోర్టు ముందుకు ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ వచ్చారు. ఈడీ సోదాల్లో డబ్బు ఎక్కడ దొరికిందో తెలుసా? అని జడ్జి ఆమెను ప్రశ్నించగా.. 'నా ఇంట్లో' అని బదులిచ్చింది. ఆ ఇల్లు నీదేనా? అని అడిగితే అవునని చెప్పింది. అయితే ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో తనకేమీ తెలియదని అర్పిత కోర్టులో వాపోయింది. తనది మధ్యతరగతి కుటంబం అని, 82 ఏళ్ల తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని పేర్కొంది. తన లాంటి వాళ్ల ఇంటిపై ఈడీ ఎలా దాడి చేస్తుందని ప్రశ్నించింది. దీనికి కోర్టు స్పందిస్తూ.. అవసరమైతే దేశంలో ఎవరి ఇంట్లోనైనా తనిఖీలు చేసే అధికారం ఈడీకీ ఉంటుందని స్పష్టం చేసింది.

టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి జులైలో అర్పిత ముఖర్జీ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీకి రూ.50కోట్లు లభ్యమయ్యాయి. కుప్పలుకుప్పలుగా ఉన్న నోట్ల కట్టల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  ఈ ఘటన అనంతరం టీఎంసీ పార్థ చటర్జీని మంత్రి పదవితో పాటు పార్టీ బాధ్యతల నుంచి తొలగించింది.
చదవండి: బయటి వ్యక్తులు తుపాకులు, బాంబులతో దిగారు

మరిన్ని వార్తలు