టీఎంసీ నేత ఇంట్లో బాంబు పేలుడు.. ముగ్గురి దుర్మరణం.. బీజేపీ తీవ్ర ఆరోపణలు

3 Dec, 2022 12:15 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఇంట్లో బాంబు పేలి.. ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుకాగా, ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

పూర్బా మేదినీపూర్ తూర్పు ప్రాంతం నార్యబిలా గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో టీఎంసీ నేత ఇంట్లో ఈ పేలుడు సంభించింది. సదరు నేత టీఎంసీ బూత్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌కుమార్‌ మన్నాగా నిర్ధారణ అయ్యింది. పేలుడు ధాటికి ఇల్లు ముక్కలైపోయింది. ఇప్పటివరకు మూడు మృతదేహాలను(రాజ్‌కుమార్‌ సహా) ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాంబు పేలుడుకి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే పేలుడు తీవ్రత.. భారీగా ఉందని, చుట్టుపక్కల మేర కొంత నష్టం వాటిల్లిందని  పోలీసులు చెప్తున్నారు.  

బీజేపీ నేత సువేందు అధికారి ఇలాకాగా పేరున్న కొంతాయ్‌ ప్రాంతంలో టీఎంసీ జనరల్‌ సెక్రటరీ అభిషేక్‌ బెనర్జీ ఇవాళ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాడి జరగడంతో రాజకీయ దుమారం చెలరేగింది. అయితే.. నాటు బాంబులు తయారు చేసే క్రమంలోనే ఈ పేలుడు సంభవించి ఉంటుందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో బాంబుల తయారీ పరిశ్రమ మాత్రమే అభివృద్ధి చెందుతోంది అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌.. అధికార టీఎంసీని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ట్విటర్‌లో పోస్ట్‌ చేసి.. పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

మరోవైపు సీపీఐ(ఎం) నేత సుజన్‌ చక్రవర్తి స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలపై సీఎం మమతా బెనర్జీ ఎందుకు మౌనం వహిస్తున్నారని, ఆమె స్పందించాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ పరిణామలపై టీఎంసీ రాష్ట్ర కార్యదర్శి కునాల్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. బెంగాల్‌లో అధికార పక్షాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఎలాంటి ఆధారాలు లేని  వ్యవహారాలు భలే దొరుకుతున్నాయని పేర్కొన్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని, వాస్తవాలు అతిత్వరలోనే తెలుస్తాయని కునాల్‌ అన్నారు.

ఇదీ చదవండి: తండ్రి వెంటే తనయుడు.. బీజేపీలోకి!

మరిన్ని వార్తలు