IAF Helicopter Crash: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు

9 Dec, 2021 12:01 IST|Sakshi

తమిళనాడు: భారత వైమానిక చర్రితలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ ఉన్నతాధికారి, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోవడంపై ఆర్మీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. హెలికాప్టర్‌ ప్రమాదంలో సిడిఎస్ బిపిన్ రావత్ మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ పోర్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఆయనతో పాటు మధులిక రావత్‌తో సహా 11 మంది మరణించినట్లు ప్రకటించింది.ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి: బిపిన్‌ రావత్‌.. వాటితో ముప్పు అని చెప్పిన మరుసటి రోజే! 

కారణాలు ఏమై ఉండొచ్చు? 
సీడీఎస్‌ జనరల్‌ బీపీఎస్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయనే దానిపై నిపుణులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలిలా ఉన్నాయి.  
1. వాతావరణం: ఎంఐ–17వి5 కూలిపోవడానికి అననుకూల వాతావరణమే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా వార్తలొచ్చాయి. ‘అన్నివేళలా ఇలాంటి దుర్ఘటనలకు వాతావరణమే ప్రధాన కారణంగా ఉంటుంది. పశ్చిమకనుమల్లో వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేం’ అని ఈ హెలికాప్టర్‌ మాజీ పైలెట్‌ అమితాబ్‌ రంజన్‌ అన్నారు 
2. విద్యుత్‌ తీగలు: మానవ ఆవాసాలకు సమీపంలో హెలికాప్టర్‌ కూలిపోయింది కాబట్టి విద్యుత్‌ తీగల్లో చిక్కుకుపోయి ఉండొచ్చనే ఊహాగానాలూ ఉన్నాయి. 
3. సాంకేతిక లోపం: ‘ఈ ఛాపర్లు కొత్తవి కావు. పైలట్లు బాగా సుశిక్షితులు. బాగా అనుభవజ్ఞులు. వీవీఐపీలకు వీరిని కేటాయిస్తారు. అయితే పైలెట్ల తప్పిదమైనా అయ్యుండాలి లేదా సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగుండొచ్చు. ఈ దశలో ఇంతకన్నా ఏమీ చెప్పలేం. దర్యాప్తులో తేలాలి’ 
4. ఏ ఎత్తులో దిగడం మొదలైందనేది ముఖ్యం 
ల్యాండింగ్‌కు సిద్ధమవుతూ ఎన్ని ఫీట్ల ఎత్తు నుంచి క్రమేపీ కిందకు దిగుతూ వచ్చిందనేది తెలియాలి. కొండప్రాంతం కాబట్టి ఎత్తు తగ్గింపులో ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బందే. దర్యాప్తులోనే ఇది తేలాలి.   

కాగా, ప్రమాదానికి వాతావరణం కానీ, సాంకేతిక లోపం కానీ కారణమై ఉండొచ్చని మాజీ ఎమ్‌ఐ-17 పైలెట్‌ అమితాబ్‌ రంజన్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారణాలపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు