అన్నదాతల అలుపెరుగని పోరాటం.. వ్యవసాయ చట్టాల కథేంటంటే

20 Nov, 2021 19:14 IST|Sakshi

అన్నదాతల ఆగ్రహానికి కారణమైన... వారిని అలుపెరుగని పోరాటానికి కార్యోన్ముఖులను చేసిన మోదీ సర్కారు తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలేమిటి? వాటిని కేంద్రం ఎలా సమర్థించుకుంది? రైతుల అభ్యంతరాలేమిటో చూద్దాం...

1. ది ఫార్మర్స్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌
(ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌– ఎఫ్‌పీటీసీ) యాక్ట్‌
రైతులు తమ ఉత్పత్తుల ప్రాంతీయ వ్యవసాయ మార్కెట్లలో కాకుండా... వాటి పరిధిని దాటి దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకొనే స్వేచ్ఛను కల్పించింది. అధికధరలు ఎక్కడ లభిస్తే అక్కడ విక్రయించుకోవచ్చు. ఎక్కడి వ్యాపారులైనా... ఎక్కడికైనా వచ్చి పంట ఉత్పత్తులను కొనొచ్చు. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చట్టాలను నిర్వీర్యం చేసింది. మార్కెట్‌ కమిటీలు వసూలు చేసే సెస్‌ను రద్దు చేసింది.  

ప్రభుత్వ వాదన: రైతులు స్థానిక వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా... తమ ఉత్పత్తులను డిమాండ్‌ ఉన్నచోటికి తరలించి మంచి ధరకు అమ్ముకోవడానికి ఈ చట్టం వీలుకల్పిస్తుంది. ఎలక్ట్రానిక్‌ మార్కెట్ల (ఈ– మార్కెట్లు)లోనూ అమ్ముకోవచ్చు. ఎక్కడో హరియాణాలో ఉన్న వ్యాపారి కూడా ఆన్‌లైన్‌ ద్వారా తెలంగాణలోని నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్లో సరుకు కొనుగోలు చేయవచ్చు. ప్యాన్‌ కార్డులు, ఇతర చట్టబద్ధ ధ్రువపత్రాలు ఉన్నవారెవరైనా సులువుగా ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు రంగంలోకి సులువుగా ప్రవేశించవచ్చు.  

రైతుల అభ్యంతరం: స్థానిక మార్కెట్లలో తమ ఉత్పత్తులకు డిమాండ్‌ పడిపోతుంది. వ్యవసాయ మార్కెట్లు లేకపోతే కనీస మద్దతు గ్యారెంటీ ఏముంటుంది? అడిగే దిక్కెవరు? మూడు నుంచి ఐదెరకాల చిన్న కమతాలు ఉన్న రైతులు పంటను రవాణా ఖర్చులు భరించి ఎక్కడో సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవడం సాధ్యమయ్యే పనేనా? కొనుగోలు ఒప్పందంలో ఏదైనా వివాదం తలెత్తినా సమస్య పరిష్కారం కోసం సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చని చట్టంలో ఉంది... సామాన్య రైతులను ఆ స్థాయి అధికారిని కలుసుకొనే అవకాశం ఉంటుందా? నిర్ణీత వ్యాపార లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు లేని వ్యక్తులు వ్యాపారంలోకి వస్తే... రైతులు మోసపోయే అవకాశాలుంటాయి.  

2. ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆఫ్‌ ప్రైస్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ యాక్ట్, 2020
ఒప్పంద వ్యవసాయానికి (కాంట్రాక్టు ఫార్మింగ్‌) ఇది చట్టబద్ధతను చేకూర్చింది. వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందు రైతులు ఫలానా ధరకు తమ పంటను అమ్ముతామని కొనుగోలుదారుతో నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే కొనుగోలుదారులు రైతులకు ఏ పంటకు ఎంత కనీస మద్దతు ధర చెల్లించాలనేది ఈ చట్టంలో ప్రస్తావన లేదు.  
ప్రభుత్వ వాదన: రైతులు తమ పంట ఉత్పత్తులను స్వేచ్ఛగా అమ్ముకొనే వీలు కలుగుతుంది. ముందస్తు ఒప్పందాల ద్వారా ఎవరికైనా అమ్ముకోవచ్చు. చట్టాల చట్రం నుంచి రైతుకు విముక్తి లభిస్తుంది.  

రైతుల భయం: వ్యవసాయరంగం కార్పొరేటీకరణకు ఇది బాటలు వేస్తుంది. బడా కంపెనీలదే గుత్తాధిపత్యం అవుతుంది. కనీసం మద్దతు ధర అనే భావన ప్రశ్నార్థకం అవుతుంది. కాంట్రాక్టు వ్యవసాయ విధానంలో సన్న, చిన్నకారులు రైతులు దోపిడీకి గురయ్యే ఆస్కారం ఉంటుంది. రైతుకు లభించే అమ్మకపు ధర మీద నియంత్రణ లేకపోతే... రైతుల బతుకులు గాలిలో దీపాలవుతాయి. వివాదాలు తలెత్తితే బడా కార్పొరేట్‌ కంపెనీలను ఎదురించి సామాన్య రైతు నిలబడగలడా?

3. నిత్యావసర వస్తువుల సవరణ చట్టం–2020
నిత్యావసర వస్తువుల నిల్వల పరిమితిపై ఇదివరకున్న ఆంక్షలను ఈ చట్టం ఎత్తివేసింది. అసాధారణ, అత్యయిక పరిస్థితులు తలెత్తితే తప్ప నిత్యావసర వస్తువుల నిల్వలపై ఆంక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా చేసింది. వంటనూనెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల తదితర ఆహార వినియోగవస్తువులను నిత్యావసరాల జాబితాలో నుంచి తొలగించింది. ఉద్యానపంటల ధరలు రిటైల్‌ మార్కెట్లో 100 శాతం పెరిగితే, ఆహారధాన్యాల ధరలు 50 శాతానికి పైగా పెరిగితేనే వ్యాపారులు, హోల్‌సేలర్ల వద్ద సదరు సరుకులు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరిమితులు విధించడానికి ఈ చట్టంలో వీలుకల్పించారు. మొత్తానికి ఈ నిబంధన మూలంగా రైతులపై పెద్దగా ప్రభావం ఉండదు కాని వినియోగదారులకు చేటు చేసేదే. పరిమితి లేకపోతే భారీగా నిల్వలు చేయడం ద్వారా బడా వ్యాపారులు కృతిమ డిమాండ్‌ను సృష్టించి నిత్యావసరాల ధరలను పెంచే ముప్పు పొంచి ఉంటుంది.     

జూన్‌ 5 2020: మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది.
ప్టెంబరు 14–22: ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడం, పెద్దగా చర్చలేకుండా లోక్‌సభ, రాజ్యసభలు మూజువాణి ఓటుతో
ఆమోదించడం జరిగిపోయింది.
సెప్టెంబర్‌ 27:  రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చాయి.

    – నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు