అనాథ మృతదేహాలను రైల్వేశాఖ ఏం చేస్తుందంటే..

8 Jun, 2023 13:11 IST|Sakshi

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందగా వెయ్యిమందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇప్పటివరకూ 202 మృతదేహాలకు శవ పంచనామా పూర్తికాగా, 86 మృతదేహాలకు శవపంచనామా ఇంతవరకూ పూర్తికాలేదు. ఆసుపత్రులలో మృతదేహాలను ఉంచేందుకు స్థలం లేకపోవడంతో వాటిని స్కూళ్లు, కోల్డ్‌ స్టోరేజీలలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనాథ మృతదేహాలను భువనేశ్వర్‌ ఎయిమ్స్‌కు తరలించారు.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతదేహం ఏడు రోజులు దాటిపోతే అత్యంత వేగంగా కుళ్లిపోతుంది. అటువంటప్పుడు గుర్తింపునకు నోచుకోని మృతదేహాలను ‍రైల్వేశాఖ ఏమి చేస్తుందనే ‍ప్రశ్న అందిరి మదిలోనూ మెదులుతుంది. దీనిగురించి రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాభ్‌ శర్మ మాట్లాడుతూ రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు మృతదేహాలను సంరక్షించడం, అనాథ మృతదేహాలుగా ప్రకటించడం, అంతిమ సంస్కారాలు చేయడం రైల్వేశాఖ పరిధిలోకి రాదని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని అన్నారు. అనాథ మృతదేహాలను ఏం చేయాలనే దానిపై ఆయా రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

కాగా అనాథ మృతదేహాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీసులు ఎటువంటి అనాథ మృతదేహన్ని గుర్తించినా ముందుగా ఈ విషయమై జిల్లా ఎస్పీకి తెలియజేయాలి. తరువాత మృతదేహానికి సంబంధించిన రిపోర్టు తయారుచేసి, ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇందుకోసం ఆ మృతదేహానికి సంబంధించిన ఫొటోను రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లు, ఆసుపత్రులకు పంపాల్సి ఉంటుంది.  దీని తరువాతనే ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలా లేదా అనేది అధికారులు నిర్ణయిస్తారు.

పోలీసులు అనాథ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు అనేక పద్ధతులను అనుసరిస్తారు. మృతదేహంపై పుట్టుమచ్చలు, టాటూలు మొదలైనవి ఏమైనా ఉన్నాయేమో గుర్తిస్తారు. అనాథ మృతదేహాలను అత్యధికంగా ఏడు రోజుల పాటు ఎవరైనా గుర్తించేందుకు ఉంచుతారు. ఆ తరువాత కూడా ఎవరూ మృతదేహం కోసం రాకపోయిన పక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అనాథ మృతదేహాల వద్ద ఏదైనా సామాను దొరికితే పోలీసులు వాటిని భద్రపరుస్తారు.

చదవండి: 6 రోజులు దాటినా కానరాని అయినవారి మృతదేహాలు

మరిన్ని వార్తలు