గుప్త నిధులు దొరికితే.. అవి ఎవరికి చెందుతాయి

9 Apr, 2021 18:06 IST|Sakshi

ఒకొక్కసారి తవ్వకాల్లో గత చరిత్ర తాలూకు గుప్త నిధులు బయటపడుతుంటాయి. అలా దొరికిన గుప్త నిదులపై ఎవరికీ అధికారం ఉంటుంది అనే దానిపై ఎక్కువ చర్చ జరుగుతుంది. తాజాగా తెలంగాణలోని జనగామ మండలం పెంబర్తి శివారు టంగుటూరు క్రాస్‌ రోడ్డు 399, 409 సర్వే నంబర్‌లోని 11.06 గుంటల భూమిలో నిన్న లంకెబిందెలు బయటపడ్డాయి. ఈ లంకె బిందెలో 18.7 తులాల బంగారు ఆభరణాలతో పాటు కిలోన్నర వెండి ఆభరణాలు, ఏడు గ్రాముల పగడాలు ఉండడంతో ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి కలెక్టరేట్‌కు తరలించారు. ఇలా బయటపడిన గుప్త నిధులు ఎవరికి చెందుతాయి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చేనీయాంశమైంది. అసలు ఇలా గుప్త నిధులు దొరికితే ఎవరికీ చెందుతాయి అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..!

భూమిలోపల దొరికిన ఎలాంటి నిధిపైన అయిన సర్వ హక్కులు ప్రభుత్వానికి ఉంటాయి. ఈ మేరకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా చట్టంలో పలు నిబంధనలున్నాయి. భూమిలో పాతిపెట్టిన నిధి జాతి వారసత్వ సంపద అయితే ప్రభుత్వానికే చెందుతుంది. అటువంటి దానిపై ఎవరికీ ఎలాంటి హక్కులు ఉండవు వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దీనికి సంబందించి 1878లో ఇండియన్‌ ట్రెజర్‌ ట్రోవ్‌ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ ని స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఈ చట్టాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) అమలు చేస్తుంది. 

భూమిలో లభ్యమైన గుప్తనిధులు చారిత్రక వారసత్వ సంపదకు చెందితే రాయి నుంచి రత్నాల దాకా ఏది దొరికినా ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా వాటిని స్వాధీనం చేసుకుంటుంది. ఎక్కడైనా నిధి దొరికిందని సమాచారం తెలియగానే స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. అక్కడ ఆ నిధిని పంచనామా చేసి కలెక్టర్‌కు అధికారులు అప్పగిస్తారు. అప్పుడు ఆ నిధి వారసత్వ సంపదా? లేదా వారి పూర్వీకులు దాచారా? అనేదానిపై కలెక్టర్ విచారణ జరుపుతారు. ఆ సంపద భూ యజమానులు పూర్వీకులదైతే దాని వారసులెవరన్న దానిపై విచారణ చేసి సంపదను వాటాలుగా విభజించి కలెక్టర్ ఆ సంపదను పంచుతారు.

ఒకవేల దొరికిన నిది జాతీయ సంపద అయితే, దొరికిన గుప్త నిధిలో 1/5 వంతు భూ యజమానికి అప్పగిస్తారు. ఆ భూమిని యజమాని కాకుండా వేరొకరు సాగుచేస్తుంటే ప్రత్యేక నిబంధన ప్రకారం కౌలుదారులు, నిధిని వెలికితీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత వాటా ఇస్తారు. గుప్తనిధి లభించిన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయకపోతే సదరు వ్యక్తులు శిక్షార్హులు. నిధి ఇవ్వకుండా తీసుకోవాలని చూస్తే సదరు వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా రెండు విధిస్తారు. పెంబర్తిలో దొరికింది జాతీయ సంపద కనుక ప్రభుత్వానికి ఆ నిధి చెందుతుంది.

చదవండి: జనగామ: బయటపడ్డ లంకె బిందె.. 5 కిలోల బంగారం!?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు