కరోనా టీకా : ఆశ‍్చర్యపోయిన మోదీ

1 Mar, 2021 13:52 IST|Sakshi

కోవాగ్జిన్‌ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

‘‘అయిపోయిందా... అస్సలు తెలియనే లేదు : ప్రధాని మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రెండవ దశ  వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సోమవారం షురూ  అయింది. 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లు పైబడి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ దశలో కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో భారత్ బయోటెక్  కోవిడ్ -19  వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్‌’  షాట్ తీసుకున్న మొదటి వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. తాను టీకా తీసుకున్న విషయాన్ని ప్రధాని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దేశాన్ని కరోనా రహితంగా చేసేందుకు అందరూ టీకా తీసుకోవాలంటూ ఈ సందర్బంగా మోదీ పిలుపు నిచ్చారు. ఎయిమ్స్ టీకా కేంద్రంలో పుదుచ్చేరికి చెందిన సిస్టర్ నివేదా ప్రధాని మోదీకి టీకా ఇచ్చారు. కేరళకు చెందిన మరో సిస్టర్ రోసమ్మ అనిల్ కూడా ప్రధానికి టీకా వేసినప్పుడు అక్కడున్నారు.  అయితే ఈ సందర్భంగా సిస్టర్‌ నివేదా, ప్రధాని మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. 

టీకా వేసుకోడానికి ప్రధాని వస్తున్నట్టు ఈ ఉదయమే తనకు తెలిసిందని గత మూడేళ్లుగా ఎయిమ్స్‌లో విధులు నిర్వహిస్తున్న సిస్టర్ నివేదా తెలిపారు. ప్రధాని మోదీని కలవడం, ఆయనకు తాను టీకా వేయడం ఆనందంగా ఉందని  నివేదా సంతోషం వ్యక్తం చేశారు. "లగా భీ దియా ఔర్‌ పతా భీ నహీ చలా ( వేసేసారా?  టీకా వ్యాక్సిన్ వేసినట్టు  అస్పలు తెలియనే లేదు)  అని టీకా తొలి డోస్ వేసిన తర్వాత ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. 28 రోజుల తర్వాత ఆయన రెండో డోస్  తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎక్కడి నుండి వచ్చామని అడిగారనీ, తమతో మాట్లాడారని ఆమె వెల్లడించారు. ఇది తనకు ఆశ్చర్యం కలిగించిందని కేరళకు చెందిన నర్సు రోసమ్మ అనిల్ పేర్కొన్నారు. టీకా తీసుకున్న తర్వాత ప్రధాని చాలా సౌకర్యవంతంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు.

మరోవైపు కోవాక్సిన్ పై చాలా తప్పుడు సమాచారం వ్యాపించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకొని  ప్రధాని దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చారని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్బంగా ఆయన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.  ముందడుగు వేసి, స్పూర్తిగా ఉండాలని ఎపుడూ చెప్పేవారని, మోదీ  టీకా స్వీకరించడంతో  మొహమాటాలు, తప్పుడు   సమాచారం ఖతమైందని ఆయన ట్వీట్‌ చేశారు. రేపు తానుకూడా వాక్సిన్‌ తీసుకునున్నానని కూడా ఆయన ప్రకటించారు. కాగా క్లినికల్ ట్రయల్స్ జరగకుండానే  భారత్‌ బయెటెక్‌ టీకాను అనుమతించడంపై విమర్శల నేపథ్యంలో ప్రధాని మోదీ కోవాగ్జిన్‌ తీసుకోవడం విశేషంగా నిలిచింది.

మరిన్ని వార్తలు