20 లక్షల ఖాతాలపై వాట్సప్‌ నిషేదం

16 Jul, 2021 04:03 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కొత్త ఐటీ నిబంధనల ప్రకారం వాట్సాప్‌ యాజమాన్యం నెలవారీ కాంప్లయన్స్‌ రిపోర్టును గురువారం విడుదల చేసింది. భారత్‌లో ఈ ఏడాది మే 15 నుంచి జూన్‌ 15 వరకూ 20 లక్షల వాట్సాప్‌ ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది. ప్రజల నుంచి 345 ఫిర్యాదులు అందాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ రూల్స్‌ ప్రకారం.. 50 లక్షలకుపైగా ఖాతాదారులున్న ప్రతి సోషల్‌ మీడియా, డిజిటల్‌ వేదిక ప్రతినెలా కాంప్లయన్స్‌ నివేదిక విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి తమకు అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను తప్పనిసరిగా తెలియజేయాలి.

హానికరమైన, అనుచితమైన సమాచారాన్ని అరికట్టడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్‌ యాజమాన్యం పేర్కొంది. ఖాతాల నుంచి ఇలాంటి సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తప్పుడు సందేశాల వ్యాప్తికి కారణమవుతున్న ఖాతాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. తాము నిషేధం విధించిన ఖాతాల్లో 95 శాతం ఖాతాలు అనధికార (స్పామ్‌) మెసేజ్‌లకు సంబంధించినవేనని తెలియజేసింది. 

మరిన్ని వార్తలు