కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే... పరిమిత సేవలే: వాట్సాప్‌

11 May, 2021 05:19 IST|Sakshi

తొలుత చాట్‌ లిస్టు చూసుకోలేం

తర్వాత ఫోన్‌కాల్స్, వీడియో కాల్స్‌ నిలిపివేత

న్యూఢిల్లీ: కొత్త ప్రైవసీ నిబంధనలు అంగీకరించేలా వాట్సాప్‌ ఒత్తిడి పెంచుతోంది. ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని మాతృసంస్థ ‘ఫేస్‌బుక్‌’తో పంచుకునేందుకు వీలు కల్పించేలా వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలకు అంగీకరించకపోతే ఇప్పటికిప్పుడు ఖాతాను తొలగించకున్నా.. వినియోగదారులు పొందే సేవలు పరిమితం చేస్తామని వాట్సాప్‌ తాజాగా ప్రకటించింది. కొద్ది వారాల తర్వాత వినియోగదారులు తమ చాట్‌ లిస్టును చూడలేరని, ఆపై వాట్సాప్‌లో ఫోన్‌ కాల్స్‌ను, వీడియో కాల్స్‌ను అందుకోలేరని స్పష్టం చేసింది.

కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించడానికి మే 15వ తేదీని గడువుగా విధించిన వాట్సాప్‌... అలా చేయని ఖాతాదారుల తక్షణం వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని, అకౌంట్‌ను తొలగించడం, సేవలకు అంతరాయం కలిగించడం చేయబోమని శుక్రవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇంతలోనే తమ వెబ్‌సైట్‌లో అసలు విషయాన్ని బయటపెట్టింది. కొత్త ప్రైవసీ పాలసీలోని నియమనిబంధనలను అంగీకరించాలని వినియోగదారులకు కొద్దివారాల పాటు రిమైండర్లు (గుర్తుచేసే సందేశాలు) పంపుతామని, అప్పటికీ ఒప్పుకోని వారికి నిరంతరం సందేశాలు వెల్లువెత్తుతాయని వాట్సాప్‌ స్పష్టం చేసింది.

అయితే వినియోగదారులకు ఎన్నివారాల గడువు ఇస్తున్నదీ స్పష్టం చేయలేదు. రిమైండర్ల తర్వాత కూడా స్పందించకపోతే వారు అందుకునే సేవలను పరిమితం చేస్తామని తెలిపింది. ఇలా కొద్దివారాల పరిమిత సేవల తర్వాత కూడా కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించని వారికి ఇన్‌కమింగ్‌ కాల్స్, నోటిఫికేషన్స్, మెసేజ్‌లు నిలిపివేస్తామని వాట్సాప్‌ ప్రకటించింది. ఖాతాలను తొలగించబోమని చెబుతూనే... వాట్సాప్‌ను కొంతకాలం వాడని వినియోగదారుల విషయంలో తాము అనుసరించే విధానాన్ని ఎత్తిచూపింది. ఎవరైనా వాట్సాప్‌ను 120 రోజులు వినియోగించకపోతే... సదరు ఖాతాను వాట్సాప్‌ తొలగిస్తుంది. అంటే... ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే కొద్దివారాల తర్వాత మన ఫోన్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి. ఆపై సదరు ఖాతా ఇన్‌యాక్టివ్‌గా మారిపోతుంది. 120 రోజుల తర్వాత దీన్ని తొలగిస్తారన్న మాట. 

మరిన్ని వార్తలు