భారత్‌ మ్యాప్‌ను తప్పుగా చూపిన ‘వాట్సాప్‌’.. కేంద్రం వార్నింగ్‌!

31 Dec, 2022 20:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘వాట్సాప్‌’ తన ట్విట్టర్‌ ఖాతాలో భారత్‌ మ్యాప్‌ను తప్పుగా చూపించే గ్రాఫిక్‌ చిత్రాన్ని పోస్టు చేయడంపై వివాదం రాజుకుంది. ప్రపంచపటంలో పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌, చైనా తమదేనని చెబుతున్న ప్రాంతాలు లేని భారత చిత్రపటాన్ని పంచుకుంది వాట్సాప్‌. దీనిపై కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ హెచ్చరికలు చేశారు. జరిగిన తప్పును వెంటనే సరిదిద్దాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. 

‘డియర్‌ వాట్సాప్‌.. భారత మ్యాప్‌లో తలెత్తిన తప్పును వెంటనే సరిదిద్దాలని కోరుతున్నాం. భారత్‌లో వ్యాపారం చేస్తున్న అన్ని సంస్థలు, వ్యాపారం కొనసాగించాలనుకుంటున్న సంస్థలు తప్పనిసరిగా సరైన మ్యాప్‌ను వినియోగించాలి. ’అని ట్విట్టర్‌లో వాట్సాప్‌ పోస్టును రీట్వీట్‌ చేశారు కేంద్ర మంత్రి. అలాగే వాట్సాప్‌ మాతృసంస్థ ‘మెటా’ను ట్యాగ్‌ చేశారు.  కొత్త ఏడాది ని పురస్కరించుకుని ఈ గ్రాఫిక్‌ చిత్రాన్ని వాట్సాప్‌ పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే జరిగిన తప్పును గుర్తించిన మంత్రి వెంటనే మెటాకు ఫిర్యాదు చేశారు. తప్పును సరిదిద్దకుంటే ఎదురయ్యే పరిణామాలపై సూత్రప్రాయంగా హెచ్చరించారు. 

భారత భూభాగాలను తప్పుగా చూపించే చిత్రాలను పోస్ట్‌ చేయడం పోలీసు కేసుకు దారితీస్తుంది. అలాంటి తప్పులు చేసే వారికి జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కశ్మీర్ లేకుండా మ్యాప్‌లను చూపించండంపై గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర సంస్థల తీరుపట్ల అసహనం వ్యక్తం చేసింది భారత్‌.

వాట్సాప్‌ క్షమాపణలు..
మంత్రి హెచ్చరికలతో తప్పుగా ఉన్న ట్వీట్‌ను తొలగించింది వాట్సాప్‌. జరిగిన తప్పుకు ట్విట్టర్‌ వేదికగా క్షమాపణలు తెలిపింది. ‘అనుకోకుండా జరిగిన తప్పును గుర్తించినట్లు మంత్రిగారికి కృతజ్ఞతవలు. దానిని వెంటనే తొలగిస్తున్నాం. అలాగే క్షమాపణలు చెబుతున్నాం. ఈ విషయాన్ని భవిష్యత్తులోనూ మా దృష్టిలో ఉంచుకుంటాం.’ అని రాసుకొచ్చింది వాట్సాప్‌ 

ఇదీ చదవండి: స్నైఫర్‌ డాగ్‌ గర్భం దాల్చడంపై ‘బీఎస్‌ఎఫ్‌’ అనుమానాలు.. దర్యాప్తునకు ఆదేశం

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు