గాంధీపై భయంకరమైన మూక దాడి

2 Oct, 2020 15:45 IST|Sakshi

(వెబ్‌ స్పెషల్‌): మహాత్మ గాంధీ గురించి ప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ చేసిన ఓ వ్యాఖ్య ఆయన జీవితాన్ని అత్యంత అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. జాతిపితను ఉద్దేశించి ఐన్‌స్టీన్‌ ‘ఇలాంటి వ్యక్తి ఒకరు, రక్తమాంసాలతో ఈ నేలమీద నడిచారు అనే విషయాన్ని ముందు తరాలవారు విశ్వసించటం కూడా కష్టమే!’  అన్నారు. ఈ ఒక్క మాట చాలు ఆయన గొప్పతనాన్ని వెల్లడించడానికి. బ్రిటిషర్లు దాదాపు రెండు వందల ఏళ్ల పాటు మనల్ని పాలించారు. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గాంధీ ఎలాంటి ఆయుధం వాడకుండా తరిమి కొట్టారంటే ఇప్పటికి వింతగానే ఉంటుంది. ఆయన అహింసా వాదం ఆ తర్వాత ఎందరికో ఆదర్శంగా నిలిచింది. హింసకు వ్యతిరేకి అయిన గాంధీ ఓ సారి దారుణ హింసకు గురయ్యారు. అది దక్షిణాఫ్రికాలో. దాదాపు 6వేల మంది తెల్ల యూరోపియన్లు గాంధీ మీద రాళ్లు రువ్వి, కోడి గుడ్లు విసిరి.. పిడి గుద్దులు కురిపించారు. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం లేకుండా ఆయన ఆ దాడి నుంచి బయటపడగలిగారు. ఈ సంఘటన 1897, జనవరి 13న చోటు చేసుకుంది.

దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పని చేస్తున్న గాంధీ భారత పర్యటన తర్వాత కుటుంబంతో కలిసి డర్బన్‌కి తిరిగి వచ్చారు. గాంధీ రెండు ఓడల కాన్వాయ్‌లో దక్షిణాఫ్రికా చేరుకున్నారు. అయితే ఆ సమయంలో గాంధీకి వ్యతిరేకంగా తెల్ల యూరోపియన్లు ఆందోళన చెపట్టడంతో ఆయన కొంత సమయం ఓడలోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే గాంధీ నాటల్‌ ప్రాంతంలోని భారతీయ ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు. దాంతో వారు ఆయన మీద కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో వారు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. బ్రిటీషర్లతో పాటు భారతీయుల సమానత్వం కోసం ఆయన కృషి చేశారు. దాంతో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆందోళన నేపథ్యంలో ఓడ కెప్టెన్‌ మహాత్మ గాంధీని కిందకు దిగవద్దని హెచ్చరించాడు. ఆ సమయంలో యూరోపియన్లు గాంధీ వచ్చిన ఓడ తిరిగి భారతదేశానికి వెళ్లాలని డిమాండ్‌ చేశారు. తిరిగి వెళ్లందుకు అవసరమైన డబ్బులు తామే ఇస్తామన్నారు. తమ మాట వినకపోతే దాడి చేస్తామని హెచ్చరించారు. (చదవండి: ఇప్ప‌టికీ 'ఆమె' పోరాడుతూనే ఉంది)

కొంత సమయం తర్వాత ప్రమాదం లేదని తెలియడంతో గాంధీ కిందకు దిగారు. పక్కనే ఉన్న ఓ వీధిలోకి వెళ్తుండగా దాదాపు 6 వేల మంది ఆయనను చుట్టు ముట్టారు. వారు చాలా కోపంగా ఉన్నారు. వారిలో కొందరు గాంధీ మీద రాళ్లు రువ్వారు.. కోడి గుడ్లతో దాడి చేశారు. ఓ వ్యక్తి గాంధీ తలపాగాను కింద పడేశాడు. కొందరు ఆయన మీద పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో గాంధీ స్పృహ కోల్పోయాడు. పోలీసులు గాంధీని దాడి చేసిన వారి నుంచి సురక్షితంగా రక్షించారు. గాంధీ తన స్నేహితుడు పార్సీ రుస్తమీ ఇంటికి చేరుకున్నారు. కానీ వందలాది మంది గుంపు ఆ ఇంటిని చుట్టుముట్టి, "గాంధీని తిరిగి మాకు అప్పగించండి" అని అరవడం ప్రారంభించింది. ఆందోళనకారులు ఇంటికి నిప్పంటించాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో ఇంటి లోపల పిల్లలు, మహిళలు సహా సుమారు 20 మంది ఉన్నారు. అప్పుడు చీఫ్ కానిస్టేబుల్ అలెగ్జాండర్ గాంధీని ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి గుంపు నుంచి రక్షిస్తాడు. (చదవండి: మహమ్మారులపై మహాత్ముడి మంత్రోపదేశం)

అలెగ్జాండర్ బ్రిటిషర్‌ కాని గాంధీ స్నేహితుడు. అతను గాంధీని భారత పోలీసు కానిస్టేబుల్‌గా తయారు చేసి, సమీప పోలీస్ స్టేషన్‌కు సురక్షితంగా రవాణా చేయడానికి ఏర్పాట్లు చేశాడు. అలెగ్జాండర్ స్వయంగా జనసమూహంలో కలిసి గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయనను అక్కడి నుంచి తప్పిస్తాడు. అలా భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి 50 సంవత్సరాల కంటే ముందే మహాత్మా గాంధీ ప్రాణాంతకమైన మూక దాడి నుంచి తప్పించుకున్నారు. ఆయన 1915 లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు.. ఆ తర్వాత స్వాతంత్య్ర సంగ్రామానికి కొత్త దిశను ఇచ్చారు.

మరిన్ని వార్తలు