ఇంతకీ తన్మే నివేదిత, కళ్యాణీ ఎవరు?

5 Aug, 2020 16:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో అరారియా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి ఇద్దరు సామాజిక కార్యకర్తల సహకారంతో జూలై 7న పోలీసు స్టేషన్‌కు వెళ్లి, కొన్ని రోజుల క్రితం నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపారని ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో ఆ యువతి, సామాజిక కార్యకర్తలు తన్మే నివేదిత, కల్యాణిలతో కలిసి దిగువ కోర్టును జూలై పదవ తేదీన ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయం గురించి కోర్టులో ఆమె, జడ్జీకి వివరించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న  కోర్టు ఉద్యోగి ఆమె వద్దకు వచ్చి, ఆ వాంగ్మూలంపై సంతకం చేయాల్సిందిగా కోరారు. తనకు చదువు రాదని, ఆ వాంగ్మూలాన్ని చదివి వినిపించాల్సిందిగా ఆమె నేరుగా జడ్జీనే కోరారు. అందుకు ఆగ్రహించిన ఆ జడ్జీ ఆమెను దూషించినట్లు ఆమె మీడియా ముఖంగా ఆరోపించారు. 

ఇదంతా జరిగిన అరగంటకు కోర్టు ఆదేశం మేరకు మూకుమ్మడి అత్యాచారం బాధితురాలిని, ఆమెకు అండగా నిలిచిన ఇద్దరు సామాజిక కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి, అరారియాకు 240 కిలోమీటర్ల దూరంలోని సమస్థిపూర్‌ జైలుకు తరలించారు. వారిపై కోర్టు కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని, ప్రభుత్వాధికారుల విధుల నిర్వహణకు అడ్డు తగిలారంటూ వారిపై  నాన్‌ బెయిలబుల్‌ కింద కేసులు నమోదు చేశారు. 

ఆ యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు యువకులను అరెస్ట్‌ చేసేందుకుగానీ, కనీసం వారెవరో గుర్తించేందుకుగానీ పోలీసులు నేటి వరకు ప్రయత్నించలేదు. దానికి సంబంధించి కోర్టు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.  ఈ యువతి ఉదంతంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో జూలై 18వ తేదీన మరో దిగువ కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. తన్మే నివేదిత, కల్యాణిలు మాత్రం నేటి వరకు కూడా విడుదల కాలేదు. వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని వారి మిత్రులు మీడియా ముఖంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకు వారెవరు ?

తన్మే నివేదిత, కళ్యాణీ
ఈ యువతీ యువకులు ‘జన్‌ జాగారణ్‌ శక్తి సంఘటన్‌’కు చెందిన సామాజిక కార్యకర్తలు. వారివురు మరో ముగ్గురితో కలిసి అరారియా ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. జన్‌ జాగారణ్‌ శక్తి సంఘటన్‌ ఉత్తర బీహార్‌లో కార్మికుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం కషి చేస్తోంది. నిమ్న వర్గాల అభ్యున్నతి, వారికి మెరుగైన వైద్య సదుపాయంతోపాటు మహిళా సాధికారికత కోసం కృషి చేస్తోన్న వారిగా తన్మే, కల్యాణీలకు మంచి గుర్తింపు ఉంది. 

30 ఏళ్ల తన్మే కేరళలో పుట్టి పెరిగారు. ఆయన అమెరికాలో ‘ఎకాలోజీ అండ్‌ సోసియాలోజీ’లో పట్టభద్రలు. ఆయన భారత్‌కు వచ్చి గత పదేళ్లుగా వివిధ సామాజిక రంగాల్లో పనిచేశారు. ఆయన ‘క్రాంతి’ సంఘంలో చేరి ముంబైలోని వేశ్య పిల్లల సాధికారికత కోసం పాటుపడ్డారు. 2014లో ఢిల్లీ వెళ్లి అక్కడి అంబేడ్కర్‌ యూనివర్శిటీలో ‘డెవలప్‌మెంట్‌ స్టడీస్‌’లో పీజీలో చేరారు. ఆయన ఎమ్మే చదువుతోనే కొంత మంది యువతీ, యువకులతో బిహార్‌లోని అరారియాకు వచ్చి గ్రామీణ మహిళల అభ్యున్నతి కోసం వర్క్‌షాపులు నిర్వహించారు. 2016లో ఆయనకు జన్‌ జాగారణ్‌ శక్తి సంఘటన్‌తో సానిహిత్యం ఏర్పడి అందులో చేరారు. సంగీతం, సాహిత్యం, చిత్రకళలో మంచి ప్రావీణ్యం ఉన్న తన్మే తన పాటలతో జనాన్ని ఆకట్టుకుంటారు.

కళ్యాణీ పరిచయం
ఢిల్లీ యూనివర్శిటీలో ‘మ్యాథ్స్, అంతర్జాతీయ సంబంధాలు’లో డిగ్రీ చదివిన కల్యాణి రెండేళ్ల క్రితం జన్‌ జాగారణ్‌లో చేరారు. ఆరోగ్య కార్యక్రమాల్లో ఆమెకు అమితాసక్తి పేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆమె తన్మేతో పాటు మరో ముగ్గురితో కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. వారి ఇద్దరి ప్రాణాలకు ముప్పుందని, వారి విడుదల కోసం పట్నా హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశామని జన్‌ జాగారణ్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన కామయాని స్వామి మీడియాకు తెలిపారు. రేపటి వరకు పట్నా హైకోర్టుకు సెలవులు అవడం వల్ల అప్పీలు ఎప్పుడు విచారనకు వస్తుందో తెలియడం లేదని ఆయన చెప్పారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా