ఎవరీ చన్నీ? 

20 Sep, 2021 02:29 IST|Sakshi

పంజాబ్‌ సీఎంగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ 1972 ఏప్రిల్‌ 2న పంజాబ్‌లోని మక్రోనా కలాన్‌ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అజ్మేర్‌ కౌర్, హర్సా సింగ్‌. దళితుల్లో రామదాసియా సిక్కు (చర్మకారులు) వర్గానికి చెందిన వారు. చన్నీ తండ్రి హర్సా సింగ్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా, బ్లాక్‌ సమితీ సభ్యుడిగా పనిచేశారు. తండ్రి నుంచి చన్నీ రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు. స్కూల్‌ యూనియన్‌ నాయకుడిగా ఎన్నికయ్యారు. పాఠశాల విద్య తర్వాత చండీగఢ్‌లోని గురు గోవింద్‌సింగ్‌ కాలేజీలో చేరారు. అనంతరం పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. తర్వాత జలంధర్‌లోని పంజాబ్‌ టెక్నికల్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. చండీగఢ్‌లోని పంజాబ్‌ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. హ్యాండ్‌బాల్‌ క్రీడలో ఆయనకు మంచి ప్రావీణ్య ఉంది. ఇంటర్‌ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ మీట్‌లో బంగారు పతకం సాధించడం విశేషం.  

మున్సిపల్‌ కౌన్సిలర్‌ నుంచి..  
చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా 2007లో చామ్‌కౌర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2012, 2017లోనూ అదే స్థానం నుంచి వరుసగా గెలిచారు. అంతకంటే ముందు మూడు పర్యాయాలు ఖరారా మున్సిపల్‌  కౌన్సిలర్‌గా గెలిచారు. రెండుసార్లు కౌన్సిల్‌ అధ్యక్షుడిగా పని చేశారు. 2015–16లో పంజాబ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2017 మార్చిలో అమరీందర్‌ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉన్నత పదవుల్లో, ప్రభుత్వ పోస్టుల్లో దళితులు అవకాశాలు దక్కడం లేదంటూ సొంత ప్రభుత్వంపైనే నిరసన గళం వినిపించి అసమ్మతి నేతగా ముద్రపడ్డారు. సీఎంను మార్చాలంటూ కాంగ్రెస్‌ నాయకత్వంపై ఒత్తిడి పెంచిన మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఉన్నారు. 2018లో ఓ మహిళా ఐఏఎస్‌ అధికారికి అనుచితమైన మెసేజ్‌ పంపించినట్లు చన్నీపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పంజాబ్‌లో ‘మీ టూ’వివాదంలో ఆయన కేంద్ర బిందువుగా మారారు. సదరు ఐఏఎస్‌ అధికారిణి ఆయనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. తర్వాత వివాదం పరిష్కారమైందని నాటి సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు. అయితే, ‘మీ టూ’వ్యవహారంలో సమాధానం చెప్పాలంటూ ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్‌ మహిళా కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.  

జ్యోతిష్యంపై గురి ఎక్కువ...
జ్యోతిష్యాన్ని బాగా విశ్వసించే చన్నీ రాజకీయాల్లో వెలిగిపోవడానికి పూజలు, యాగాలు అధికంగా చేస్తుంటారని ఆయన సన్నిహితులు చెప్పారు. 2017లో మంత్రివర్గంలో చేరిన వెంటనే ఓ జ్యోతిష్యుడి సూచన మేరకు చండీగఢ్‌లోని తన ఇంటికి తూర్పు దిశగా రాకపోకల కోసం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పార్కులో నుంచి అక్రమంగా రోడ్డును నిర్మించుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రోడ్డును కార్పొరేషన్‌ అధికారులు మూసివేశారు. అలాగే ఓ జ్యోతిష్యుడి సలహాతో చన్నీ ఖరార్‌లోని తన ఇంటి ప్రాంగణంలో ఏనుగుపై ఊరేగారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.  
– నేషనల్‌ డెస్క్, సాక్షి 

సీఎం పదవి వద్దన్నాను: అంబికా సోని
న్యూఢిల్లీ: పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న ఆఫర్‌ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అంబికా సోని ఆదివారం చెప్పారు. ఆ సూచనను సున్నితంగా తిరస్కరించానని, సిక్కు నాయకుడే పంజాబ్‌ సీఎంగా ఉండాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. శనివారం రాజీనామా చేసిన అమరీందర్‌ వారసుడి ఎంపిక కోసం కాంగ్రెస్‌ నాయకత్వం విస్తృతంగా చర్చలు జరిపింది. పార్టీ నేత రాహుల్‌ గాంధీతో శనివారం రాత్రి, ఆదివారం అంబికా సోనితో భేటీ అయ్యారు. కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టాలంటూ పార్టీ పెద్దలు తనను కోరిన మాట నిజమేనని ఆమె మీడియాతో చెప్పారు. కానీ, పంజాబ్‌లో గత 50 ఏళ్లుగా సిక్కు నాయకులే ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారని, ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. దేశంలో సిక్కు సీఎం ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబేనని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు