Jalebi Baba: ‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా..

9 Jan, 2023 18:46 IST|Sakshi

మంత్ర తంత్రాల మాటున మహిళలను చెరబట్టిన ‘జిలేబీ బాబా’ పాపం పండింది. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆ కీచకుడు ఎట్టకేలకు దోషిగా తేలాడు. ఆ వివరాలు..

జిలేబీ బాబా అసలు పేరు అమర్‌పురి అలియాస్‌ అమర్‌వీర్‌. అతనిది పంజాబ్‌లోని మాన్సా ప్రాంతం. 20 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హరియాణాలోని తొహనాకు వచ్చాడు. తొహనా రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం తెరిచాడు. ఈక్రమంలో భార్య కన్నుమూయడంతో అమర్‌వీర్‌ రెండేళ్లు పత్తాలేకుండా పోయాడు. తర్వాత తొహనాకు తిరిగొచ్చి తాంత్రిక విద్యలు తెలుసంటూ నాటకానికి తెరతీశాడు. సమస్యలేవైనా తొలగించేస్తా అంటూ జిలేబీ బాబాగా అవతారమెత్తాడు. జనాల దృష్టిని ఆకర్షించాడు. ఆధ్యాత్మిక చింతన పేరుతో కొందరిని బురిడీ కొట్టించి బాబా బాలక్‌నాథ్‌ గుడిలో పూజారిగా కూడా పని చేయడం ప్రారంభించాడు.  

ఆత్మలు ఆవహిస్తాయని...
మాయమాటలు చెప్పి ఎందరో మహిళలను లొంగదీసుకున్నాడు. తాంత్రిక పూజలు చేసేటప్పుడు ఆత్మలు వారిని ఆవహిస్తాయని నమ్మించేవాడు. తర్వాత వారికి మత్తు మందు ఇచ్చి స్పృహ లేకుండా చేసేవాడు. తర్వాత వారిపై అకృత్యానికి ఒడిగట్టేవాడు. అంతటితో ఆగకుండా వాటిని వీడియోలు కూడా తీసేవాడు. ఆ వీడియోలను సదరు బాధితులకు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేసి సొమ్ము రాబట్టేవాడు. మరికొందరిని తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు. 

అయితే, ఒక వీడియో బాబా బాగోతాన్ని బట్టబయలు చేసింది. జిలేబీ బాబా ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే అదనుగా కొందరు మహిళలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబా నివాసముంటున్న చోట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడంతో 120కి పైగా వీడియోలు, కొన్ని మత్తు పదార్ధాలు లభించాయి. దాంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన హరియాణా కోర్టు అతడిని దోషిగా తేలుస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. 

మరిన్ని వార్తలు