భారత్‌- కెనడా మధ్య టెన్షన్‌ టెన్షన్‌.. ఎవరీ పవన్‌ కుమార్‌ రాయ్‌?

21 Sep, 2023 17:29 IST|Sakshi

India-Canada diplomatic row ఖలిస్తానీ ఉగ్రవాది హత్యోదంతంతో భారత్‌- కెనడా మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు ఈ వివాదానికి తెరలేపాయి. నిజ్జర్ హత్యతో భారత్‌ ఏజెంట్లకు సంబంధం ఉందంటూ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక కెనడాలో భారత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న పవన్ కుమార్ రాయ్‌ను కెనడా విదేశాంగశాఖ ఆ దేశం నుంచి బహిష్కరించింది. 

ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అసంబద్ధమైనవని కొట్టిపారేసింది. కెనడా దౌత్య అధికారిని ఇండియా కూడా బహిష్కరించింది. ఈ పరిణామం తర్వాత ఇరుదేశాలు పలు ఆంక్షలు విధించాయి. అక్కడి భారతీయులకు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చిరించింది. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించాలని సూచించింది. అలాగే తదుపరి నోటీసులు ఇచ్చే వరకు కెనడాకు వీసా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..?

ఎవరీ పవన్‌ కుమార్‌ రాయ్‌
 పవన్‌ కుమార్‌ రాయ్‌  కెనడాలో భారత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు.  భారత్‌, కెనడా మధ్య ఏర్పడిన ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అతనే ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. పవన్ కుమార్ రాయ్ 1997 బ్యాచ్ కు చెందిన పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి. రాష్ట్రంలో డ్రగ్స్ సంబంధిత కేసులను సమర్ధవంతంగా పరిష్కరించిన చరిత్ర ఆయనకు ఉంది.  2010 జులై 1 నుంచి డిప్యుటేషన్ పై ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. అంతకుముందు జలందర్‌, అమృత్‌ సర్‌ జిల్లాల సీనియర్ ఎస్పీగా పనిచేశారు.

అతని సేవలను గుర్తించిన పంజాబ్ ప్రభుత్వం జనవరి 31, 2023న  అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) స్థాయి పదోన్నతి కల్పించింది. రాయ్‌కు భారత ఇంటెలిజెన్స్‌ విభాగమైన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW)  మాజీ చీఫ్ సమంత్ కుమార్ గోయెల్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2018లో  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కేంద్రం నియమించింది. అనంతరం కెనడాలో ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌గా ఎంపికయ్యారు. 

కాగా ఖలిస్థానీ సానుభూతిపరుడు, భారత్‌ నిషేధిత ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌(కేటీఎఫ్‌) అధినేత హర్‌దీప్‌ సింగ్‌ను గత జూన్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. జూన్ 18న పశ్చిమ కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలోని గురుద్వారా వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నిజ్జర్‌ను  కాల్చి చంపారు. అయితే హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ను మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ జాబితాలో చేర్చింది. అతడిని పట్టించిన వారికి 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.,

మరిన్ని వార్తలు