Bela Bose Mitra Life History: నేతాజీకి అండగా నిలిచిన మహిళా సేనాని ఎవరు?

26 Sep, 2023 13:27 IST|Sakshi

ఒక వీధికి లేదా రహదారికి లేదా ఏదైనా ప్రదేశానికి ప్రముఖుల పేర్లు పెట్టడాన్ని మనం చూసేవుంటాం. ఇటువంటి గౌరవం అధికంగా మహనీయులైన పురుషులకే దక్కింది. భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో మహాత్మా గాంధీ పేరు మీద ఏదో ఒక రహదారి తప్పకుండా ఉంటుంది. ఈ విషయంలో మహనీయులైన మహిళామణులకు అటువంటి గౌరవం దక్కడం తక్కువేనని చెప్పవచ్చు. 

తూర్పు రైల్వే కూడా చాలా కాలం పాటు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే, 1958లో ఈ విధానంలో మార్పును తీసుకువచ్చింది. భారతీయ రైల్వేలు దేశానికి చెందిన ఒక మహనీయురాలికి ఘన నివాళులర్పించాలని నిర్ణయించాయి. ఆ మహనీయురాలి పేరు మీద పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఒక స్టేషన్‌కు ‘బేలా నగర్ రైల్వే స్టేషన్’ అనే పేరు పెట్టారు. భారత చరిత్రలో ఇలాంటి గౌరవం పొందిన తొలి మహిళగా బేలా మిత్ర నిలిచారు. 

పశ్చిమ బెంగాల్‌లోని కొడలియాలోని సంపన్న కుటుంబంలో 1920లో జన్మించిన బేలా మిత్రను అమిత లేదా బేలా బోస్ అని కూడా పిలుస్తారు. ఆమె తండ్రి సురేంద్ర చంద్రబోస్. ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్  అన్నయ్య. అంటే బేలా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ‘నేతాజీ’కి మేనకోడలు. 1941లో స్వాతంత్ర్య సంగ్రామ పోరాటం జరుగుతున్న సమయంలో నేతాజీని గృహనిర్బంధంలో ఉంచినప్పుడు, అక్కడి నుంచి ఆయన తప్పించుకునేందుకు బేలా ప్రధాన పాత్ర పోషించారు. చాలా చిన్న వయస్సులోనే బేలా స్వాతంత్ర్య పోరాటానికి అంకితమయ్యారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఏ) ఏర్పడినప్పుడు ఆమె ‘ఝాన్సీ రాణి’ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు. ఆమె భర్త హరిదాస్ మిశ్రా కూడా ఆమె మాదిరిగానే విప్లవకారుడు. 

ఐఎన్‌ఏ ప్రత్యేక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బేలాను అధికారులు కలకత్తాకు పంపారు. అక్కడ ఉంటూనే ఆమె స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, బేలా భర్త జైలు నుండి విడుదలయ్యారు. అతనితో పాటు అనేక మంది విప్లవకారులు విడుదలయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అదే సమయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని బేలా నిర్ణయించుకున్నారు.

విభజన వల్ల జరిగిన హింసాకాండలో నష్టపోయిన వారికి సహాయం చేయాలని బేలా నిర్ణయించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని శరణార్థులకు సహాయం చేయడానికి ఆమె 1947లో ‘ఝాన్సీ రాణి రిలీఫ్ టీమ్’ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి, బాధితులకు సేవలు అందించారు. 1952, జూలైలో ఆమె తన చివరి శ్వాస వరకు బాధితులకు సేవ చేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రోద్యమంలో విశేష సేవలు అందించినప్పటికీ బేలా పేరు చరిత్ర పుటలలో అంతగా కనిపించకపోవడం శోచనీయం.
ఇది కూడా చదవండి: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్‌ ఏమిటి?

మరిన్ని వార్తలు