Tamil Nadu Assembly Election 2021: అధికారం ఎవరిదో?

24 Mar, 2021 08:00 IST|Sakshi

ఎన్నికల్లో కనిపించని ప్రభావం 

కొనసాగుతున్న ఉత్కంఠ 

సాక్షి, చెన్నై‌: ఎన్నికలంటేనే అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మధ్య అధికారం దక్కించుకునేది ఎవరనే పోటీ ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో ఎదో ఒక పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచడం, ఆ పార్టీకి మహత్తర విజయాన్ని కల్పించడం సాధారణ విషయం. 1952 నుంచి శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. 1952 కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఒకే కూటమిగా ఎన్నికలను ఎదుర్కొన్నాయి. అప్పట్లో తమిళనాట తీవ్ర ఆహార కొరత ఏర్పడడంతో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీచాయి. దీంతో కాంగ్రెస్‌ వెనుకంజ వేయకతప్పలేదు. 1967లోను అప్పటి అనుకూల పవనాలు డీఎంకేను గెలుపొందేలా చేశాయి. ఆ తర్వాత ఎంజీఆర్‌ డీఎంకే నుంచి వైదొలగి అన్నాడీఎంకే పార్టీని ఏర్పరిచారు. దీంతో 1972లో ఆ పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే భారీ విజయం సాధించింది.

కాంగ్రెస్‌కు మళ్లీ ఘోర పరాభవం తప్పలేదు. 1984 ఎన్నికలలో ఎంజీఆర్‌ అనారోగ్యానికి గురై అమెరికా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఆ సమయంలో ఎన్నికలు జరగడంతో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. దీంతో ఏర్పడిన సానుభూతి పవనాల కారణంగా అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ కూటమి భారీ విజయం సాధించింది. 1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రధాని రాజీవ్‌గాందీపై బోఫోర్స్‌ అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇది కాంగ్రెస్‌కు వ్యతిరేకత తీసుకొచ్చింది. అప్పట్లో ఎంజీఆర్‌ మృతితో అన్నాడీఎంకే జయలలిత వర్గం, జానకి వర్గంగా విడిపోయి ఎన్నికలను ఎదుర్కొన్నాయి. ఈ కారణంగా డీఎంకే విజయం సాధించి అధికారం చేపట్టింది. 1991లో అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ కూటమి పోటీ చేశాయి.

ఆ సమయంలో శ్రీపెరంబుదూరు ప్రచారానికి వచ్చిన రాజీవ్‌గాంధీ హత్యకు గురికావడంతో సానుభూతి పవనాలు అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ కూటమిని గెలిపించాయి. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితపై అవినీతి ఆరోపణలు రావడంతో వ్యతిరేకత ఏర్పడింది. దీంతో డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్‌ కూటమి గెలుపొందింది. 2001లో అన్నాడీఎంకే, 2006లో డీఎంకే అధికారంలోకి వచ్చాయి. 2011 ఎన్నికలు 2జీ స్పెక్ట్రం అవినీతి కారణంగా డీఎంకే పరాజయంపాలై అన్నాడీఎంకే అధికారం చేజిక్కించుకుంది. 2016లో ఎటువంటి పవనాలు వీచలేదు. ఇరుపార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా అన్నాడీఎంకే అధికారం చేపట్టింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోను ఎటువంటి పవనాలు వీచడం లేదు. ఇరు పార్టీలకు ఉన్న పలుకుబడిని బట్టే గెలుపు, ఓటములు ఉంటాయి. 

మరిన్ని వార్తలు