భారత్‌లో కరోనా మరణాలు తక్కువెందుకు!?

27 Aug, 2020 19:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లో కూడా ప్రాణాంతక కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నప్పటికీ మన దేశంలోనే మరణాలు చాలా తక్కువగా ఉంటున్నాయని, కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని చెప్పడంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే ప్రభుత్వం కలిసి కట్టుగా తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల కరోనా మహమ్మారిని పటిష్టంగా ఎదుర్కొంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు అందరూ చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్లనే భారత్‌లో కరోనా మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోందా? సామాజిక, జీవపరమైన సంబంధాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రపంచంలో చాలా దేశాలకన్నా భారత్‌లో కోవిడ్‌ మరణాలు ఎంత తక్కువగా ఉన్నాయంటే, మృతులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ 23వ స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో నమోదవుతున్న కోవిడ్‌ కేసుల్లో మరణాల సంఖ్య 1.87 శాతం ఉంది. ఈ విషయంలో మనకన్నా రష్యా, ఫిలిప్పీన్స్, కజికిస్థాన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, ఖతార్‌ దేశాల్లో మృతుల సంఖ్య తక్కుగా ఉంది. (చదవండి: వారికి కరోనా వ్యాక్సిన్‌ కూడా పనిచేయదట!)

భారత్‌లో కరోనా మరణాలు తక్కువగా నమోదవడానికి ప్రధాన కారణం ‘ఏజ్‌ ఫ్యాక్టర్‌’. కరోనా సోకిన వారిలో వయస్సు మళ్లిన వారు ఎక్కువగా చనిపోతున్నారు. పిన్న వయస్కులు చనిపోవడం లేదు. కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తక్కువ వయస్కులు ఎక్కువగా ఉన్నారు. యూరోపియన్, లాటిన్‌ అమెరికన్‌ దేశాలతోపాటు అభివృద్ధి చెందిన తూర్పు ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే యువతరం ఎక్కువ. వారు కరోనా బారిన పడినప్పటికీ మృత్యు ముఖంలోకి వెళ్లకుండా వారి వయస్సు అడ్డు పడుతోంది. ‘నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్‌ రిసర్చ్‌’ ఇటీవల విడుదల చేసిన అధ్యయన పత్రంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారత్‌లో కరోనా బారిన పడిన 50 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్కుల్లో కోలుకున్న వారికంటే మరణించిన వారి సంఖ్యే ఎక్కువ. (చదవండి: రెండు నెలలు ఓపిక పట్టండి : సీరం సీఈఓ)

కరోనాకు గురైన 50 ఏళ్ల లోపు వయస్కుల్లో మరణాలకంటే కోలుకున్నా వారి సంఖ్యే ఎక్కువ. 50 ఏళ్లకు పైన వయస్సు ఎలా పెరుగుతుంటో మృతుల సంఖ్య అలా పెరుగుతుండగా, 50 లోపు వయస్కుల్లో వయస్సు ఎలా తగ్గుతుంటే మృతుల సంఖ్య అలా తగ్గుతూ వస్తోంది. మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో వృద్ధులే కాకుండా మధ్య వయస్కులు కూడా ఎక్కువ మందే కరోనా బారిన పడగా, భారత్‌లో మధ్య వయస్కులు, యువతరం ఎక్కువగా కరోనా బారిన పడింది. అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారే భారత్‌లో ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. పైగా అమెరికా, యూరప్‌ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఊబకాయుల సంఖ్య తక్కువ.

మరణాలు ఎక్కువగా ఉన్న దేశాలతో పోలిస్తే భారత్‌లో భిన్నమైన సాంస్కృతిక జీవనం ఉండడం వల్ల ఆ దేశాలంతా వేగంగా భారత్‌లో కరోనా విజృంభించలేదు. ఈ దేశంలో కాయకష్టం చేసే వాళ్లే ఎక్కువగా వైరస్‌ బారిన పడడంతో వారిలో ఉండే రోగ నిరోధక శక్తి వారిని ఆదుకుంది. ప్రపంచంలో ఎక్కడా అమలు చేయనంత కఠినంగా భారత్‌లో లాక్‌డౌన్‌ అమలు చేయడం వల్ల ఆదిలో కరోనా వైరస్‌ను బాగానే కట్టడి చేయగలిగామని, ఆ తర్వాత వలస కార్మికుల సమస్య తలెత్తడం వల్ల అంతగా ఫలితం లేకుండా పోయిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు