దక్షిణాదికి, ఉత్తరాదికి ఎంత వ్యత్యాసం!

12 Oct, 2020 17:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య భాష, సంస్కృతుల పరంగానే కాకుండా సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెల్సిందే. అయితే ఇది మహిళల విషయంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాదితో పోలీస్తే దక్షిణాది మహిళలు ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఎక్కువ విద్యావంతులు, చిన్నతనంలో కాకుండా యుక్త వయస్సు వచ్చాకే పెళ్లిళ్లు చేసుకుంటారు. తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకోవడంతో కొంత స్వేచ్ఛ ఉంది. భర్తలతో ఎక్కువ చనువుగా ఉంటారు. తక్కువ సంతానం కలిగి ఉంటారు. సొంతంగా ఆస్తులు కలిగి ఉంటారు. తల్లిదండ్రులు ఇచ్చే కట్నాలకు తామే హక్కుదారులుగా ఉంటారు. స్నేహితులతో కలసిమెలసి తిరుగుతారు. ఆఫీసుల్లో మగవాళ్లతో కలసి పనిచేస్తారు.

ఉత్తర, వాయువ్య భారత్‌లో మహిళలు ఎక్కువగా పురుషుల ఆధిపత్యం కింద ఒదిగి జీవిస్తారు. వారిలో విద్యార్హతలు తక్కువే. సెకండరీ స్కూల్‌ పూర్తి చేసిన మహిళలు కూడా జీవిత భాగస్వామిని సొంతంగా ఎంపిక చేసుకోరు. కుటుంబ సభ్యులపైనే ఆధార పడతారు. మహిళలు ఉద్యోగాలు చేయడం తక్కువే. అక్షరాస్యత, స్వయం ప్రతిపత్తి, ఉద్యోగం చేయడంలోను తక్కువే. వీరితో పోలిస్తే దక్షిణాది మహిళలు కులం, మతం విషయంలోనూ స్వేచ్ఛా జీవులే.

ఉత్తర భారత్‌తో పోలిస్తే, దక్షిణ భారత్‌కు చెందిన ఆడి పిల్లల్లో శిశు మరణాలు తక్కువ. 1800 శతాబ్దంలో మద్రాస్, ముంబై ప్రాంతాల్లో సతీసహగమనం చాలా తక్కువకాగా, బెంగాల్లో 90 శాతం సతీసహగమనం సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1876–78లో మద్రాస్‌ను కరవు పరిస్థితులు కబళించినప్పుడు లింగ నిష్పత్తిలో పెద్దగా వ్యత్యాసం రాలేదు. 1896–97లో పంజాబ్‌లో కరవు పరిస్థితులు తాండవించినప్పుడు అధిక సంఖ్యలో బాలికలు మరణించారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 1880లోనే 15, 16 ఏళ్లు వచ్చాకే ఆడ పిల్లలు పెళ్లి చేసుకోగా, రాజస్థాన్‌ బాలికలు ఆ స్థాయికి చేరుకోవడానికి వందేళ్లు పట్టింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో చదువుకునే మహిళల సంఖ్య చాలా తక్కువ. ఉత్తరాదిలో స్త్రీ, పురుషుల మధ్య విద్యాభ్యాసంలో వ్యత్యాసం 26 శాతం ఉండగా, అదే దక్షిణాదిలో ఈ వ్యత్యాసం 9 శాతం మాత్రమే.

బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో దక్షిణాది మహిళలు చురుగ్గా పాల్గొనడం, గాంధీ, నెహ్రూ, సరోజని నాయుడు లాంటి వారు సంఘ సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం, దక్షిణాది మహిళలను వారు ఎక్కువ ప్రభావితం చేయడం, కందుకూరి వీరేశలింగం లాంటి సంఘ సంస్కర్తలు దక్షిణాదికి చెందిన వారవడం, దక్షిణాదిలో మహిళల విద్యను ప్రోత్సహించడం, మహిళా సంఘాలు పుట్టుకురావడం, వ్యవసాయ పనుల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల నేడు ఉత్తరాదికన్నా దక్షిణాది మహిళలు ముందున్నారు. 1900 దశాబ్దంలోనే మద్రాస్‌లో ‘విమెన్స్‌ ఇండియన్‌ అసోసియేషన్‌’ ఏర్పడడం, ఆ తర్వాత 1917లో పుణె కేంద్రంగా ‘ఆల్‌ ఇండియా విమెన్స్‌ కాన్ఫరెన్స్‌’ ఏర్పాటవడం ఇందుకు ఉదాహరణ. (లండన్‌ కింగ్స్‌ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేస్తోన్న ఎలైస్‌ ఎవాన్స్‌ తన వెబ్‌సైట్‌లో రాసిన పరిశోధనా వ్యాసం నుంచి)

చదవండి: యూపీలోనే ఎక్కువ.. ఎందుకిలా? 

Poll
Loading...
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు