మానవ తప్పిదంతో కరోనా వేగంగా వ్యాప్తి

20 Apr, 2021 13:55 IST|Sakshi

మన రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే స్థాయికి కరోనా 

ఇంటిగ్రేటెడ్‌ స్పెషలిస్టు మైక్రోబయాలజిస్టు డాక్టర్‌ దుర్గా సునీల్‌ వాస

సాక్షి, హైదరాబాద్‌: మనిషి రోగనిరోధక శక్తి పటిష్టమైంది. అందుకే భయంకరమైన వైరస్‌లను కూడా తట్టుకోగలుగుతున్నాడు.. ఇప్పుడు కరోనా వైరస్‌ కూడా తన జన్యుపరమైన శక్తిని పెంచుకోవటం ద్వారా మనిషి రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతోందా? కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌గా ప్రస్తుతం పరిగణిస్తున్న, కరోనా వైరస్‌ విస్తృతిని చూస్తుంటే ఔననే సమాధానం వస్తోందంటున్నారు వైద్య నిపుణులు. అంటే మనిషి తన రోగనిరోధక శక్తిని పటిష్టం చేసుకున్నట్టే, ఆ శక్తి నుంచి తట్టుకుని నిలిచేలా కరోనా వైరస్‌ కూడా తన నిరోధకతను (జన్యువులో మార్పు) శక్తిమంతం చేసుకుందంటున్నారు. దాన్ని మ్యుటేషన్‌గా భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

‘సాధారణంగా ఈ వైరస్‌ రెండో దశ ఇంత వేగంగా వచ్చే అవకాశం లేదు. కానీ వైరస్‌లో మ్యుటేషన్‌ వల్ల తిరిగి అది విజృంభిస్తోంది. గతేడాది మొదటి దశలో చూసిన వేగానికి ఇప్పుడు దాని వేగానికి అసలు పొంతనే లేదు. కేవలం వారం పది రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. చూస్తుండగానే దేశంలో రోజుకు రెండు లక్షలకు మించి కొత్త కేసులు నమోదవుతుండటమే దీనికి కారణం. ఇది వైరస్‌లో సంభవించిన మ్యుటేషన్లే కారణం’ అని విశ్లేస్తున్నారు ఇంటిగ్రేటెడ్‌ స్పెషలిస్టు, మైక్రో బయాలజిస్టు డాక్టర్‌ దుర్గా సునీల్‌ వాస. దీనికి మానవ తప్పిదమే కారణంగా నిలుస్తోందని, దీన్ని మళ్లీ నియంత్రించాలంటే మనమే మారాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

గతేడాది మార్చిలో కరోనా వైరస్‌ ప్రభావం వెలుగు చూసిన తర్వాత కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చి డిసెంబర్‌ నుంచి మళ్లీ బాగా తగ్గుముఖం పట్టాయి. జనవరిలో పరిస్థితి దాదాపు సాధారణ స్థితికి వచ్చినట్లే అనిపించింది. దీన్ని ప్రజలు అలుసుగా తీసుకోవటం వైరస్‌ విజృంభించేందుకు కారణమైంది. అది చివరకు మ్యుటేషన్లకు దారితీసింది. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటించి ఉంటే వైరస్‌కు పరివర్తనం చెందే అవకాశం వచ్చేది కాదు. కోవిడ్‌ లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. కోవిడ్‌ సోకిందని తేలిన వెంటనే చికిత్స ప్రారంభించుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు వైరస్‌ ఎక్కువ రోజులు శరీరంలో ఉండే అవకాశం ఉండదు. ఇతరులకు సోకే ప్రమాదం ఉండదు.

సరైన చికిత్స అవసరం.. 
వైరస్‌ సోకిందని సకాలంలో గుర్తించటమే కాకుండా దానికి సకాలంలో సరైన చికిత్స కూడా ప్రారంభించాలి. ఈ విషయంలో చాలామంది తోచిన మందులు వేసుకుంటున్నారు. కొన్ని చోట్ల సరైన అవగాహన లేని వైద్యులు కూడా సరైన చికిత్స అందించకుండా వైరస్‌ పెరిగేందుకు కారణమవుతున్నారు. యూరప్‌ లాంటి దేశస్తులకు మనకున్నంత రోగనిరోధక శక్తి ఉండదు. వారిపై వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన వైరస్‌ను మనం సులభంగానే తట్టుకోగలుగుతాం. కానీ మ్యుటేషన్‌ చెంది మన నిరోధకతను కూడా తట్టుకునేలా మార్పులు చేసుకుంది. మానవ తప్పిదంతో వేగంగా మ్యుటేషన్‌ చెంది రెట్టింపు వేగంతో విస్తరిస్తోంది. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తే వీలైనంత తొందరగా నియంత్రణలోకి వస్తుంది.

చదవండి: ఈ పరికరం కరోనా బాధితులకు ఓ వరం

మరిన్ని వార్తలు