ఇంటింటికి వ్యాక్సిన్‌ ఎందుకు సాధ్యం కాదు: బాంబే హైకోర్టు

12 Jun, 2021 19:10 IST|Sakshi

వ్యాక్సిన్‌ పాలసీపై కేంద్రానికి మొట్టికాయలు వేసి బాంబే హైకోర్టు

ముంబై: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న టీకా విధానంపై బాంబే హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న టీకా విధానం వల్ల దేశ వ్యాప్తంగా ఇంటింటికి వ్యాక్సిన్‌ డ్రైవ్‌ సాధ్యం కాదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. టీకా కార్యక్రమంలో భాగంగా కేరళ, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు పాటిస్తున్న ‘డోర్-టు-డోర్’ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని కోర్టు కేంద్రానికి సూచించింది.

ఆ రెండు రాష్ట్రాలు ఇంటింటికి టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తుండగా.. మీరు మాత్రం.. రాష్ట్రాల్లో ఈ పద్దతి సాధ్యం కాదని చెబుతున్నారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.  ఈ విధమైన పాలసీని పాటించేందుకు మీకు ఎదురవుతున్న సమస్య ఏంటి అని చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జి.ఎన్.కులకర్ణిలతో కూడిన బెంచ్ కేంద్రాన్ని ప్రశ్నించింది. 

ఇంటింటికి వ్యాక్సిన్‌ కార్యక్రమంపై ధృతి కపాడియా, కునాల్ తివారీ అనే అడ్వొకేట్లు దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్బంగా కోర్టు ఇలా తీవ్రంగా స్పందించింది. ఆ లాయర్లు తమ పిల్‌లో ఈ ప్రత్యేక ‘పాలసీ’ గురించి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. దీనిపై కోర్టు దాదాపు వీరి వాదనతో ఏకీభవిస్తూ..ఈ విషయంలో మీకు వచ్చిన సమస్య ఏమిటో అర్థం కావడం లేదని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

ఈ విధమైన కార్యక్రమాన్నితామూ చేపడతామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని లాయర్లు ప్రస్తావించారు. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదించి తగిన ఆదేశాలు తీపెకోవాలని, ఈ విధమైన కారక్రమం అమలులో సాధ్యాసాధ్యాలను వీలైనంత త్వరగా పరిశీలించాలని కోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్‌కి సూచించింది. ఈ నెల 14 న ఈ పిల్ పై మళ్ళీ విచారణ జరగాలని బెంచ్ నిర్ణయించింది. 

చదవండి: విద్యార్థుల భవిష్యత్తును చెడగొడతారా?: బాంబే హైకోర్ట్‌

మరిన్ని వార్తలు