కరోనా పరీక్షలంటే ఎందుకు భయం?!

28 Oct, 2020 14:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌ రాష్ట్రంలోని ఛాతా నాన్‌హెరా గ్రామంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం కొందరు గ్రామస్తుల నుంచి న మూనాలు సేకరించి పరీక్షించగా వారిలో ఇద్దరికి పాజిటివ్‌ అని వచ్చింది. వెంటనే వారిని ఆరోగ్య కేంద్రంలోని ‘క్వారెంటైన్‌’కు వెళ్లాల్సిందిగా కోరారు. అందుకు వారిద్దరు నిరాకరించారు. అదే రోజు సాయంత్రం స్థానిక గురుద్వారా నుంచి ఓ ప్రకటన వెలువడింది. గ్రామంలో ఎవరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోరాదని, పరీక్షల కోసం వచ్చే వైద్యాధికారులను కూడా అడ్డుకుంటామన్నది ఆ ప్రకటన సారాంశం. కరోనా లాంటి మహమ్మారి ఏదీ లేదని, ఆ పేరుతో ప్రజలను ఆరోగ్య కేంద్రాలకు తరలించి, దౌర్జన్యంగా వారి శరీరంలోని అవయవాలను వెలికి తీసి అమ్ముకుంటున్నారని, కొన్ని సందర్భాల్లో అవయవాల కోసం హతమారుస్తున్నారనే వదంతలు ఊరంతట వినిపించడం, గురుద్వారా నుంచి అలాంటి ప్రకటన వెలువడడానికి అసలు కారణం. (స్కూళ్లు మరింత ఆలస్యం! )

చాలినన్ని టెస్ట్‌ కిట్స్, ల్యాబ్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా దేశాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించలేక పోతుండగా, భారత్‌లో మాత్రం ఇలాంటి వదంతుల వల్ల కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని వైద్య వర్గాలే తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత పంజాబ్‌లోని ఖరార్‌లో కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయని తెలిసి ఓ ప్రభుత్వ వైద్య బందం అక్కడికి వెళ్లింది. యాభై పోలింగ్‌ కేంద్రాల పరిధిలో సర్వే నిర్వహించి 500 ఇళ్లను పరీక్షలు నిర్వహించేందుకు గుర్తించారు. వాటిలోని 465 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. వారిలో కేవలం నలుగురంటే నలుగురే కరోనా పరీక్షలకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఉన్నత వైద్యాధికారులు వెళ్లి వారికి ఎన్నో విధాలుగా నచ్చ చెప్పగా చివరకు సగం మంది మాత్రమే పరీక్షలకు సిద్ధమయ్యారు. (నవంబర్‌ 30 వరకూ అన్‌లాక్‌ 5.0 గైడ్‌లైన్స్‌ అమలు)

ఎక్కువ మంది కరోనా పరీక్షలకు సిద్ధం కాకపోవడమే కాకుండా వారిలో చాలామంది తమకున్న కరోనా లక్షణాలు చెప్పకుండా దాచి పెట్టారు. ఇతర బీపీ, సుగర్‌ లాంటి జబ్బులున్న విషయాన్ని కూడా ఎక్కువ మంది వెల్లడించలేదు. ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే’ ప్రకారం ఆ ప్రాంతంలో 12 శాతం మందికి బీపీలు, 8 శాతం మందికి సుగర్‌ ఉండగా, కరోనా సర్వేలో మాత్రం 2.6 మంది బీపీ, 1.7 శాతం మంది సుగర్‌ ఉన్నట్లు అంగీకరించారు. (అది చాలా ప్రమాదకరం: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌)

ఎందుకు వారు వాస్తవాలు వెల్లడించలేదు. వారిని పట్టుకున్న భయాలేమిటీ? కొందరు వదంతులు నమ్మడం వల్ల, మరికొందరు క్యారంటైన్‌ లేదా ఆస్పత్రులకు వెళ్లడానికి భయపడి నిజాలు చెప్పకపోగా, ఇంకొందరు, ముఖ్యంగా దినసరి కూలీల మీద బతికేవారు క్వారెంటైన్‌కు వెళితే ఉపాధి పోతుందన్న భయంతోనే కరోనా పరీక్షలకు జంకుతున్నారు. పంజాబ్‌లోని పలు గ్రామాల్లోనే కాకుండా, వెనకబడిన యూపీ, బిహార్‌ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇటీవల భారత్‌లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయని అధికార వర్గాలు ప్రకటించడం పట్ల కూడా ప్రజలకు అంతగా నమ్మకం లేదు. గతంలో వైద్యాధికారులు నయానో, భయానో ఒప్పించి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తుండడం ఇందకు కారణం కావచ్చని సిపీఆర్‌ఇండియా వర్గాలు వ్యాఖ్యానించాయి. (ఇప్పట్లో థియేటర్‌కు వెళ్లే ఆలోచనే లేదు..!)

మరిన్ని వార్తలు