మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళకు ఆస్తి దక్కదు!

6 Jul, 2021 01:06 IST|Sakshi

బిలాస్‌పూర్‌: చనిపోయిన భర్త తరఫు ఆస్తిపై మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళ తన హక్కును కోల్పోతుందని చత్తీస్‌గఢ్‌ హైకోర్టు పేర్కొంది. అయితే, ఆ మహిళ మరో పెళ్లి చేసుకున్నట్లు చట్టప్రకారం నిరూపితం కావాలని స్పష్టం చేసింది. వరుసకు తనకు అన్న అయిన ఘాసీ భార్య కియబాయి.. ఘాసీ మరణానంతరం స్థానిక సంప్రదాయం ప్రకారం మరో పెళ్లి చేసుకుందని, అందువల్ల చనిపోయిన తన అన్న ఆస్తి ఆమెకు చెందకూడదని ఆదేశాలివ్వాలని కోరుతూ లోక్‌నాథ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజయ్‌ కే అగర్వాల్‌ తాజాగా పై ఆదేశాలిచ్చారు.

‘హిందూ విడో రీమ్యారేజ్‌ యాక్ట్, 1856లోని సెక్షన్‌ 6 ప్రకారం పునర్వివాహానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు నిరూపితం కావాల్సి ఉంటుంది.  పునర్వివాహం చట్టప్రకారం నిరూపితమైతే.. ఆ మహిళకు తొలి భర్త ద్వారా లభించిన ఆస్తిపై హక్కు ఇకపై ఉండదు’ అని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. స్థానిక చుడి సంప్రదాయం(గాజులు ఇవ్వడం ద్వారా ఒక మహిళను పెళ్లి చేసుకోవడం) ప్రకారం కియాబాయి పునర్వివాహం చేసుకుందని లోక్‌నాథ్‌ వాదించారు. కియాబాయి మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేవని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు