కొడుకు బర్త్‌డేకి తప్పకుండా వస్తానన్నాడు.. ఇంతలోనే

14 Nov, 2021 20:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇంపాల్‌: మణిపూర్‌లో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్‌’కు చెందిన ఖుగా బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

మరణించిన భద్రతా సిబ్బందిలో అస్సాం రైఫిల్స్ జవాన్ సుమన్ స్వర్గిరీ ఒకరు. బక్సా జిల్లాలోని బరామా ప్రాంతానికి సమీపంలోని తేకెరకుచి కలిబారి గ్రామానికి చెందిన సుమన్‌ 2011లో భారత సైన్యంలో చేరాడు. అంతకుముందు 2007లో మిలిటెంట్లు అతని తండ్రి కనక్ స్వర్గిరీని హత్య చేశారు. సుమన్ చివరిసారిగా ఈ ఏడాది జూలైలో ఇంటికి వచ్చాడు.
(చదవండి: మణిపూర్‌లో తీవ్రవాదుల ఘాతుకం)

సుమన్‌కు వివాహం అయి ఓ కుమారుడు ఉన్నాడు. డిసెంబర్‌లో కుమారుడి మూడవ పుట్టిన రోజు. కొడుకు బర్త్‌డేకు తప్పకుండా వస్తానని భార్యకు మాటిచ్చాడు. మరి కొన్ని రోజుల్లో భార్యాబిడ్డలను కలవబోతున్నానని తెగ సంతోషించాడు సుమన్‌. కానీ అతడి ఆనందాన్ని తీవ్రవాదులు దూరం చేశారు. సుమన్‌ కుటుంబంలో జీవితాంతం తీరని దుఖాన్ని మిగిల్చారు. సుమన్‌ మరణ వార్త తెలిసి అతడి భార్య గుండలవిసేలా విలపిస్తోంది. 

‘‘నా భర్త వచ్చే నెల కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వస్తానని మాటిచ్చాడు. పోయిన శుక్రవారం నాకు కాల్‌ చేశాడు. అప్పుడు తాను ఓ రిమోట్‌ ఏరియా ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలిపాడు.. అక్కడి నుంచి తిరిగి వచ్చాక కాల్‌ చేస్తానన్నాడు. మాకు కాల్‌ చేసే లోపే అతడికి తీవ్రవాదుల రూపంలో చివరి కాల్‌ వచ్చింది. నాకు, నా బిడ్డకు దిక్కెవరు’’ అంటూ ఏడుస్తున సుమన్‌ భార్యను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. 
(చదవండి: ఉగ్రదాడి.. బీజేపీ సర్పంచ్‌ దారుణ హత్య)

ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్‌ రివల్యూషనరీ పార్టీ ఆఫ్‌ కాంగ్లీపాక్‌(ప్రెపాక్‌), పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. మణిపూర్‌ విముక్తి కోసం ఈ సంస్థలు పోరాడుతున్నాయి.

చదవండి: ఆ విషాదంపై రతన్‌ టాటా భావోద్వేగం​

మరిన్ని వార్తలు