మరీ ఇంత అరాచకమా.. భర్తను కాదని ప్రియుడితో జంప్‌.. ఆ తర్వాత..

19 Aug, 2022 07:28 IST|Sakshi

తుమకూరు: భర్త, ముగ్గురు పిల్లలను వదిలి ప్రియునితో కలిసి దుబాయ్‌కి వెళ్లిపోయిందో మహిళ. తరువాత కాల్స్‌ చేస్తూ ఆటపట్టిస్తోంది. ఈ హింసను తట్టుకోలేక ఆ భర్త ముగ్గురు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తాను తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం కర్నాటకలో చోటుచేసుకుంది.  

వీడియో కాల్స్‌తో హేళన..  
తుమకూరులోని పిహెచ్‌ కాలనీలో సమీవుల్లా (45) భార్య సాహెరా బాను, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట సాహెరాబాను ప్రియునితో కలిసి దుబాయ్‌కి వెళ్లిపోయింది. అప్పటినుంచి సమీవుల్లా ఒక్కడే ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును పోషిస్తూ జీవిస్తున్నాడు. మరోవైపు సాహెరా బాను దుబాయ్‌ నుంచి తన పిల్లలకు వీడియో కాల్‌ చేస్తూ హేళనగా మాట్లాడేది.

ఈ పరిణామాలతో విరక్తి చెందిన సమీవుల్లా గురువారం ఉదయం పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను కూడా సేవించాడు. కొంతసేపటికే సమీవుల్లా చనిపోగా, పిల్లలు ప్రాణాలతో కొట్టుమిట్టాడడం చూసిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అంబులెన్సులో బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.  

ఇది కూడా చదవండి: అన్నతో కాళ్లు మొక్కించారని కోపం.. ప్రాణం తీసిన రెండేళ్ల కిందటి మెసేజ్‌

మరిన్ని వార్తలు