నాడు కరోనాతో భర్త మృతి.. ఇప్పుడు సమాధి తవ్వి అస్తికలు తీసి.. 

25 May, 2023 12:53 IST|Sakshi

లక్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫ‌రూఖాబాద్‌లో ఒక విచిత్ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. కరోనాతో మృతిచెందిన తన భర్త అస్తికల కోసం తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన భర్తను ఖననం చేసిన ప్రాంతంలో ఏకంగా తవ్వకాలు జరిపింది. అనంతరం, అతడి అస్తికలను స్వగ్రామంలో ఖననం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. కేర‌ళ‌కు చెందిన జే పాల్, జాలీ పాల్‌ జంట యూపీలోని ఫరూఖాబాద్‌లో నివాసం ఉంటోంది. అయితే, క‌రోనా సమయంలో వైరస్‌ కారణంగా భర్త ఈజే పాల్‌ మృతి చెందాడు. లాక్‌డౌన్ కార‌ణంగా భ‌ర్త మృత దేహాన్ని ఆమె కేర‌ళ‌లోని అత‌ని స్వ‌గ్రామానికి తీసుకువెళ్లలేక‌పోయింది. భ‌ర్త మ‌ర‌ణానంత‌రం ఆమె మాత్రం తిరిగి కేర‌ళ వెళ్లిపోయింది. అయితే, ఆమె త‌న భ‌ర్త అందించిన ప్రేమ‌ను మ‌ర‌చిపోలేక‌పోయింది. 

దీంతో, జాలీ పాల్ త‌న భ‌ర్త అస్థిక‌ల‌ను  కేర‌ళ తీసుకువెళ్లి, అక్క‌డ‌ తిరిగి ఖ‌న‌నం చేసేందుకు ఫ‌రూఖాబాద్‌లోని శ్మ‌శాన వాటిక‌లో త‌వ్వ‌కాలు జ‌రిపేందుకు జిల్లా అధికారుల అనుమ‌తి కోరింది. ఆమె విన‌తిని స్వీక‌రించిన అధికారులు పాల్ స‌మాధిని త‌వ్వేందుకు అనుమ‌తినిచ్చారు. స్థానిక మెజిస్ట్రేట్ స‌మ‌క్షంలో పాల్ స‌మాధి తవ్వ‌కాలు జ‌రిపి, అస్థిక‌ల‌ను వెలికితీశారు. ఇప్పుడు జాలీ పాల్ వీటిని తీసుకుని కేర‌ళ వెళ్లి, అక్క‌డ వాటిని ఖ‌న‌నం చేయ‌నుంది. 

ఈ సంద‌ర్భంగా జాలీ పాల్ మాట్లాడుతూ త‌న భ‌ర్త  పాల్ సెంట్ ఏంథ‌నీ స్కూలులో టీచ‌ర్ అని తెలిపింది. క‌రోనా కాలంలో త‌న భ‌ర్త మృతి చెందాడ‌ని, లాక్‌డౌన్ కార‌ణంగా త‌న భ‌ర్త మృత‌దేహాన్ని కేర‌ళ తీసుకువెళ్ల‌లేక‌పోయాన‌ని పేర్కొంది. అందుకే ఇప్పుడు భ‌ర్త అస్థిక‌ల‌ను కేర‌ళ తీసుకువెళ్లేందుకు అధికారుల అనుమ‌తి తీసుకున్నాన‌ని స్పష్టం చేసింది. వాటిని కేర‌ళ‌లోని త‌మ స్వ‌గ్రామంలో ఖ‌న‌నం చేయ‌నున్నాన‌ని పేర్కొంది. 

ఇది కూడా చదవండి: రెండేళ్ల ప్రేమ, పెళ్లి మండపం నుంచి వరుడు పరార్‌.. చివరకు..

మరిన్ని వార్తలు