నా భర్త జీతమెంతో చెప్పండి.. ఆర్టీఐని ఆశ్రయించిన భార్య!

3 Oct, 2022 19:46 IST|Sakshi

భారత సాంప్రదాయ పద్దతుల్లో భార్యాభర్తల బంధం ఎంతో విలువైంది. ఈ బంధం దృఢంగా ఉండాలంటే కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే లక్షణం ఉండాలని పెద్దలు చెబుతుంటారు. భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా.. నాలుగు గోడల మధ్యే తేల్చుకోవాలని కానీ.. బయటకు రాకుండా చూసుకోవాలంటారు. అయితే, ఇక్కడ ఓ జంట మధ్య ఏ సమస్య వచ్చిందో ఏమో కానీ.. తన భర్త జీతం ఎంతో తెలుసుకునేందో ఓ భార్య ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. జీతం వివరాల కోసం ఏకంగా ఆర్టీఐRight To Information (RTI)నే ఆశ్రయించింది. 

వివరాల ప్రకారం.. సంజూ గుప్తా అనే మహిళ తన భర్త జీతం వివరాలు కోరుతూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఆర్టీఐ అధికారులు ఊహించని విధంగా షాకిచ్చారు. కాగా, భర్త అంగీకారం లేకుండా ఆదాయ పన్ను శాఖలోని సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీపీఐఓ) వివరాలు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. 

ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తపరిచిన సంజూ గుప్తా.. ఫస్ట్‌ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించింది. వివరాల కోసం అక్కడ అప్పీల్ చేసుకుంది. అనూహ్యంగా అక్కడ కూడా ఆమె చేదు అనుభవమే ఎదురైంది. ఎఫ్‌ఏఏ కూడా సీపీఐఓ చెప్పిన సమాధానాన్నే సమర్థించింది. ఆ వివరాలు ఇచ్చేలా చూడాలంటూ ఈసారి ఆమె.. సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్ కమిషన్‌(సీఐసీ)కు దరఖాస్తు చేసుకుంది. 

పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ఆమెకు ఎట్టకేలకు సీఐసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో  సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న సీఐసీ ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. 15 రోజుల్లోగా ఆమె భర్తకు సంబంధించిన జీతం వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉన్నప్పటికీ.. సంజూ గుప్తా ఇలా భర్త జీతం వివరాలు ఎందుకు అడగాల్సి వచ్చిందో అనేది మాత్రం తెలియరాలేదు. బహుషా వారి మధ్య ఆర్థికపరమైన విషయాల్లో గొడవలు వచ్చినట్టు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు