మోదీ భక్తుడిపై నీలి నీడలు

13 Nov, 2020 18:11 IST|Sakshi

సందిగ్ధంలో బీజేపీ నాయకత్వం

పట్నా : బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పై ముప్పేట దాడి చేసిన లోక్‌జనశక్తి (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొండంత అండగా ఉన్న తండ్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ అకాల మరణంతో ఒంటరి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌ ఓటమే లక్క్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ప్రచారం చేశారు. చివరకు తాను అనుకున్న లక్ష్యం నెరవేరకున్నా ఎన్డీయే కూటమిలో జేడియూ ఓట్లను చీల్చుతూ సీట్ల సంఖ్య తగ్గించగలిగారు. ఎల్జేపీ వల్లే సుమారు 35 మంది అభ్యర్థులు ఓడిపోయారని జేడియూ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కేం‍ద్రంలో  ఎన్డీయే కూటమిలో భాగసామ్య పార్టీఅయిన ఎల్జేపీపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎన్నికల తర్వాత ప్రెస్‌ మీట్‌లో నితీష్‌ డిమాండ్‌ చేశారు. (చదవండి:మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: నితీష్‌)

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయ్యింది బీజేపీ పరిస్థితి. బిహార్‌లో ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎన్డీయే కూటమి నష్టపోయినప్పటికీ, బీజేపీ అతిపెద్ద భాగసామ్య పక్షంగా అవతరించడంతో సహాయ పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎల్‌జేపీ అభ్యర్థులను బరిలో నిలపలేదు. మరోవైపు ఎన్నికల ర్యాలీలలో ఎల్జేపీ యువనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హనుమంతుడిలాంటి భక్తునంటూ ప్రచారం చేశారు. రాష్ష్ర్టంలో బీజేపీ అధికారంలోకి రావడం తన ధ్వేయమని పలు బహిరంగ సభల్లో ప్రకటించారు. ఇలాంటి తరణంలో కేంద్రమంత్రి రవిశంకర్‌​ ప్రసాద్‌ మాట్లాడుతూ... ‘ఎల్జేపీ జాతీయ పార్టీ కాదు. ఇది బిహార్‌కి చెందిన ప్రాంతీయ పార్టీ. చిరాగ్‌ పాశ్వాన్‌ ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీష్‌ కుమార్‌ని వ్యతిరేకించారు. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ మృతితో ఖాళీ అయిన మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా? అనేది పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా నిర్ణయిస్తారు’ అని అన్నారు. (చదవండి:బిహార్‌ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్‌ ఫీచర్స్‌‌)

 చిరాగ్‌ని చీకొట్టడానికి అడ్డంకులేంటీ?
ప్రధాని మోదీ ఎన్నికల సభలో రాం విలాస్‌ పాశ్వాన్‌ని గుర్తు చేస్తూ.. ఒక మంచి మిత్రుడిని కోల్పోయనని పేర్కొన్నారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా కాకుండా దళితులకు చేరువవడంలో రాంవిలాస్‌ పాశ్వాన్‌, రాందాస్‌ అథవాలే విశేష కృషి చేశారు. రానున్న బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కూటమి నుంచి ఎల్జేపీ అవమానకర స్థితిలో బయటకు పంపిస్తే దళిత వర్గాల్లో బీజేపీ బలహీన పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఎన్డీయే నేతృత్వలో ఏర్పాటు కానున్న ప్రభుత్వానికి చిరాగ్‌ మద్దతు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు